AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరో రెండు పథకాల అమలుపై కీలక అప్డేట్.. ఎప్పటి నుంచంటే..

తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పథకాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం మరికొన్ని పథకాలను అమలు చేయనుంది. లోక్‌ సభ ఎన్నికలకు ముందే మరో రెండు పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. వీటిలో ఒకటి రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌ ఒకటికాగా, మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థికసాయం అందించే పథకం.

ఇటీవల విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి హైదరాబాద్‌ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. మహా లక్ష్మి హామీలో భాగమైన ఈ రెండు పథకాలను అమల్లోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో కలిపి రూ. 500 ఎల్పీసీ సిలిండర్‌ కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో, మొత్తం 91.49 లక్షల మంది మహిళలు రూ. 500 ధర కలిగిన సబ్సిడీ ఎల్‌పిజి సిలిండర్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

అలాగే ప్రజాపాలనలో మొత్తం 92.23 లక్షల మంది నెలకు రూ. 2500 ఆర్థిక సాయానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు. ఇతర పథకాలతో పోల్చితే గ్యాస్‌ సబ్సిడీ, మహిళలకు ఆర్థిక సహాయంకు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) ప్రకటనకు ముందే మహాలక్ష్మి పథకంలోని రెండు భాగాలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఉచిత బస్సు పథకం ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుందో.. మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సాయం, రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌ అంతే ప్రాధన్యంగా నిలిచింది. ఉచిత బస్సు పథకాన్ని ఇప్పటికే విజయవంతంగా కొనసాగిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ రెండు పథకాలను ఎలా అమలు చేస్తుందో చూడాలి.

ANN TOP 10