రాష్ట్రంలో హాట్‌టాపిక్
హస్తం గూటికి అంటూ ఊహాగానాలు
అభివృద్ధి పనులకే వెళ్లామంటున్న ఎమ్మెల్యేలు
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ కావడంపై సర్వత్రా హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. వీరంతా ‘హస్తం’వైపు చూస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవలే దావోస్ పర్యటన ముగించుకుని నగరానికి చేరుకున్న సీఎంతో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కావడం.. అదికూడా రేవంత్ ఇంట్లో కలవడంపై తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఎమ్మెల్యేలు మాత్రం అభివృద్ధి పనుల కోసం కలిశామంటున్నా తెరపైకి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సైతం ఇందుకు దోహదం చేస్తున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సాపూర్, దుబ్బాక, పటాన్చెరు, జహీరాబాద్ ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు మంగళవారం సీఎం నివాసానికి వెళ్లి కలిశారు. వీరు సీఎంను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వీరు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. సునీతా లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచే బీఆర్ఎస్లో చేరారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి మొదటి నుంచి గులాబీ బాస్ కేసీఆర్‌కు సన్నిహితుడు. మిగతా ఇద్దరు నేతలు కూడా కేసీఆర్ వెన్నంటి నడుస్తున్న వారే. రేవంత్‌రెడ్డితో పాటు, ఇంటెలిజెన్స్ చీఫ్ బి.శివధర్‌రెడ్డిని కూడా వీరు కలిసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఒకవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఈ నలుగురు సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం చర్చకు దారితీస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు విషయంలో బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్‌కు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితర మంత్రులు అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు. ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందంటూ బీఆర్ఎస్ విమర్శలపై స్పందించిన కోమటిరెడ్డి.. తమతో సుమారు 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వీరు భేటీ కావడం హాట్‌టాపిక్‌గా మారింది.









