AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చైనాలో 7.2 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు

చైనాలోని జిన్‌జియాంగ్‌ దక్షిణ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతగా నమోదయింది. భూఉపరితలానికి 80 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ ఎక్స్‌ వేదికగా ప్రకటించింది. అయితే ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్టుగా నమోదుకాలేదు. కాగా ఈ తీవ్ర భూకంపం ధాటికి భారత రాజధాని న్యూఢిల్లీలోనూ భూప్రకంపనలు నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ తెలిపింది. రాత్రి 11.39 గంటల సమయంలో భూప్రకంపనలు నమోదయినట్టు వెల్లడించింది. జనవరి 11న ఆఫ్ఘనిస్థాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిన సమయంలో కూడా ఢిల్లీ రాజధాని ప్రాంతంలో భూప్రకంపనలు నమోదయ్యాయి. ఆ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌కు ఈశాన్య దిశలో 241 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో పాకిస్థాన్‌లో కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి.

ఇదిలావుంచితే చైనా ఇటీవల వరుసగా ప్రకృతి వైపరీత్యాలను చవిచూస్తోంది. సోమవారం ఉదయం నైరుతి చైనాలోని మారుమూల, పర్వత ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ప్రభావంతో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఏకంగా 47 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించాల్సి వచ్చింది. యున్నాన్ ప్రావిన్స్‌లోని జెన్‌క్యాంగ్ కౌంటీలో సోమవారం ఉదయం 5.51 గంటల సమయంలో కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడడంతో ఈ విపత్కర పరిస్థితి నెలకొందని చైనా మీడియా సంస్థ జిన్హువా రిపోర్ట్ పేర్కొంది.

ANN TOP 10