అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా సాగింది. అనంతరం బాల రాముడు దర్శన భాగ్యం కలిగింది. సాయంత్రం అయోధ్య నగరంలో ‘రామజ్యోతి’ వెలిగింది. సరయూ నదీ తీరంలో దీపోత్సవం శోభాయమానంగా సాగింది. అయోధ్య 10 లక్షల దీపాలతో కాంతులీనింది. గృహాలు, సంస్థలు, దుకాణాలు, ఆధ్మాత్మిక ప్రదేశాల్లో రామభక్తులు ‘రామజ్యోతి’ని వెలిగించారు. మిఠాయిలు పంచి, బాణాసంచా పేలుస్తూ సంతోషం వ్యక్తం చేశారు. సరయూ నది ఒడ్డున మట్టి దీపాలతో దీపోత్సవం నిర్వహించారు.

దాదాపు 14లక్షల దీపాలను వెలిగించగా.. నదీ తీరమంతా దీపాల వెలుగులతో నిండిపోయింది. దీపోత్సవం చూపరులను మంత్రముగ్ధులను చేసింది. అలాగే కనక్ భవన్, హనుమాన్‌గర్హి, గుప్తర్‌ఘాట్, లతా మంగేష్కర్ చౌక్, మణిరామ్ దాస్ కంటోన్మెంట్ సహా వంద దేవాలయాలు, ప్రధాన కూడళ్లు, బహిరంగ ప్రదేశాల్లో దీపాలు వెలిగించారు. అదే సమయంలో ఇండ్లలోనూ దీపాలను రామజ్యోతిని వెలిగించారు. సరయూ ఒడ్డున అధికారిక హారతి కార్యక్రమం కనుల పండువలా సాగింది. అలాగే, రామ మందిరం వద్ద లేజర్ లైట్ షో నిర్వహించారు. అలాగే రంగుల దీపాలతో రాంలాలా ఆలయంతో పాటు కాంప్లెక్స్ మొత్తం వెలిగిపోయింది.









