AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విశ్వం.. విశ్వాత్మ శ్రీరాముడే.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక రాజధాని అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం ఈ మహత్తర ఘట్టం గురించి ప్రధాని మోదీ ప్రసంగించారు. తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు ‘జై సియా రామ్‌’ అంటూ తన భక్తిభావాన్ని చాటుకున్నారు. మన రామ్‌లల్లా ఇకపై చిన్నపాటి టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదని, దివ్య భవ్యమైన మందిరంలో కొలువుదీరారని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. ‘‘పవిత్రమైన అయోధ్యాపురికి శిరసు వంచి నమస్కరిస్తున్నా అన్నారు. ఈ రోజు రామ భక్తులంతా ఆనంద పరవశంలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ శతాబ్ధాల కలను సాకారం చేసుకునేందుకు ఎన్నో బలిదానాలు, పోరాటాలు, త్యాగాలు చేసినట్లు గుర్తు చేశారు. ఇలాంటి అనేక ఘటనల తర్వాత బాలరాముడు మళ్లీ అయోధ్యకే వచ్చి చేరుకున్నాడని చెప్పారు. ఈ శుభ గడియల్లో ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

ఈ పుణ్యకార్యం ఆలస్యమైనందుకు క్షమించమని రాముడిని వేడుకుంటున్నాట్లు తెలిపారు. జనవరి 22, 2024.. ఇది కేవలం తేదీ మాత్రమే కాదని. కొత్త కాలచక్రానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ గొప్ప కార్యంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా చివరకు న్యాయమే గెలిచించిందని ప్రధాని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇందుకు న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ‘‘ఈ శుభ గడియల కోసం 11 రోజులపాటు కఠోర దీక్ష చేసినట్లు తెలిపారు. రాముడితో అనుబంధం ఉన్న క్షేత్రాలన్నీ సందర్శించా. ఏపీలోని లేపాక్షి ఆలయం, తమిళనాడులోని రామేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నా. సాగర్‌ నుంచి సరయూ వరకు రామనామం జపించానన్నారు. మన దేశ సంస్కృతి కట్టుబాట్లకు రాముడే మూలం. ఆయన ఆదర్శం, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యం. ఇది విగ్రహ ప్రాణ ప్రతిష్ఠే కాదు.. మన విశ్వాసాలకు ప్రాణప్రతిష్ఠ అని చెప్పుకొచ్చారు.

రాముడు వివాదం కాదు సమాధానం అని సంచలన విషయాలు వెల్లడించారు. రాముడు అగ్ని కాదు.. వెలుగు అంటూ శ్రీరాముని విశిష్ఠతను వివరించారు. రాముడే భారతదేశానికి ఆధారం అని చరిత్రను గుర్తు చేశారు. భారతదేశ విధానం కూడా అదేనని వివరించారు. నిత్యం, నిరంతరం, విశ్వం, విశ్వాత్మ శ్రీరాముడే అని ఆయన పరిపూర్ణత్వాన్ని తన ప్రసంగంలో అందించారు మోదీ. కొన్ని శతాబ్దాల వరకూ ఈ పవిత్ర తేదీని ప్రజలు గుర్తుంచుకుంటారని తన భావనను వ్యక్త పరిచారు. ఈ క్షణం కోసం స్వాతంత్ర్యానికి పూర్వం, తరువాత అనేక మంది అనేక రకాలుగా తమ స్వరాన్ని వినిపించారు. అలాగే అయోధ్య ప్రజలు వందల ఏళ్లుగా నిరీక్షించారన్నారు. దేశ ప్రజలందరి తరఫున ఈ పుణ్య కార్యంలో పాల్గొనడం మహదానందంగా ఉందన్నారు. ఈ రోజు దేశమంతా దీపావళి జరుపుకుంటోందని.. ఈ రాత్రికి ప్రతి ఇంటా రామజ్యోతి వెలగాలని మోదీ పిలుపునిచ్చారు.

ANN TOP 10