AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. అద్దంకి దయాకర్‌కు మరోసారి నిరాశ..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని చివరి నిమిషం వరకూ ప్రచారం జరిగింది.

కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం దక్కుతుందని భావించగా.. చివరి నిమిషంలో జాబితా నుంచి ఆయన పేరు ఎగిరిపోయింది. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ఇద్దరు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్‌ అధిష్టానం బుధవారం (జనవరి 17) ఖరారు చేసింది. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్ కుమార్‌ గౌడ్‌, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌లను ఎంపిక చేసింది. నామినేషన్లు దాఖలు చేయడానికి రేపటితో గడువు ముగుస్తుండటంతో ఈ ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది.

అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీగా అవకాశం దక్కనుందని జాబితా వెలువడటానికి ముందు వరకూ ప్రచారం జరిగింది. నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోమని ఆయనకు పార్టీ సీనియర్ల నుంచి సూచనలు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. న్యూస్ ఛానెళ్ల చర్చా వేదికల్లో, సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ తరఫున గొంతు వినిపించే అద్దంకి దయాకర్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడం పార్టీ శ్రేణులను విస్మయపరిచింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందని అంతా భావించారు. తాజాగా ఎమ్మెల్సీ ఛాన్స్ కూడా దక్కకపోవడంతో అద్దంకి దయాకర్ అనుచరులకు మరోసారి నిరాశే ఎదురైంది.

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్ కుమార్‌ గౌడ్‌‌కు అధిష్టానం వద్ద గుర్తింపు ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. అద్దంకి దయాకర్‌కు వరంగల్ లోక్ సభ స్థానం టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

ANN TOP 10