అదనపు వనరుల సమీకరణపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివిధ శాఖల అధికారులకు సూచించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి పరిశ్రమలు, గనులు భూగర్భ వనరులు, హౌజింగ్ కార్పొరేషన్, హౌజింగ్ బోర్డ్, హెచ్ఎండిఏ, టీఎస్ ఐఐసీ శాఖలో ఉన్నత అధికారులతో అదనపు వనరుల సమీకరణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వారీగా ప్రభుత్వానికి రావలసిన పెండింగ్ బకాయిలపై చర్చించారు. పరిశ్రమలు, టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏ శాఖల పరిధిలో ఇప్పటివరకు జరిగిన భూ అమ్మకాలు, వాటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం, ఇంకా రావలసిన బకాయి నిధులు, బకాయిల నిధుల సమీకరణ కొరకు ఆయా శాఖలు రూపొందించే అవసరమైన కార్యాచరణ అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం.. మాట్లాడుతూ పెండింగ్ బకాయిలు సమకూర్చుకునేందుకు కార్యాచరణ రూపొందించుకొని నిధులను రాబట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన ప్రతి పైసా ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని సమీకరించే బాధ్యత ఆయా శాఖల అధికారులు తీసుకోవాలని సూచించారు. ఇండస్ట్రియల్ పార్కులను వినియోగంలోకి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆదాయంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆ శాఖ అధికారులు ఆదేశించారు. ఇసుక కొరత లేకుండా చూడాలని సూచించారు.