ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు బాణసంచా తరలిస్తున్న లారీలో మంటలు చెలరేగాయి. దీంతో పటాకులు పేలడంతో ఆ లారీ పూర్తిగా కాలిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 22న అయెధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగనున్నది. ఈ నేపథ్యంలో తమిళనాడు నుంచి అయోధ్యకు భారీగా బాణసంచాను లారీలో రవాణా చేస్తున్నారు. అయితే మంగళవారం రాత్రి ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలోని ఖర్గి ఖేడా గ్రామానికి ఆ లారీ చేరుకోగా మంటలు చెలరేగాయి. దీంతో లారీలోని బాణసంచా అంతా పేలిపోయింది. ఈ మంటలకు ఆ లారీ పూర్తిగా కాలిపోయింది. ఇది చూసి ఆ గ్రామస్తులు భయాందోళన చెందారు. కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపుచేశారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. అయోధ్యకు బాణసంచా తరలిస్తున్న లారీకి మంటలు ఎలా వ్యాపించాయి అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
