AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజ్‌భవన్‌ వద్ద ఉద్రిక్తత.. భట్టి, సీతక్క అరెస్ట్‌

హైదరాబాద్‌: అదానీపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భట్టి విక్రమార్క, సీతక్కలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. మోడీ, అదానీ బావబామ్మర్ధుల లెక్క అని, వాళ్ల బంధం విడదీయరానిదని ఆరోపించారు. అదానీ అంశంలో జేపీసీ వేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. అదానీని ఎప్పుడు అరెస్ట్‌ చేస్తారనేది చూసేందుకు దేశం ఎదురుచూస్తోందని భట్టి తెలిపారు.

రాజ్‌భవన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఇతర కాంగ్రెస్‌ నేతలన పోలీసులు అరెస్ట్‌ చేశారు. నేతలతో పాటు కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఈ క్రమంలో రాజ్‌భవన్‌ వద్ద కాంగ్రెస్‌ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు బలవంతంగా కార్యకర్తలను వ్యాన్‌లోకి ఎక్కించి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అదానీ స్కాంపై విచారణ చేయించాలని డిమాండ్‌ చేస్తూ గాంధీ భవన్‌ నుంచి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతలు భారీ ర్యాలీతో బయలుదేరారు. దీంతో రాజ్‌భవన్‌ వద్ద పోలీసులు అప్రమత్తం అయ్యారు. రాజ్‌భవన్‌ వైపు వెళ్లే రోడ్డును మూసివేశారు.

కాంగ్రెస్‌ నేతలు రాజ్‌భవన్‌ వద్దకు చేరుకుని ముట్టడిరచేందుకు ప్రయత్నాలు చేస్తుండగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో రాజ్‌భవన్‌ వద్ద కాసేపు టెన్షన్‌ వాతావరణం నెలకొంది. దేశంలో ప్రధాని మోడీ దేశ సంపదను అదానీకి దోచి పెట్టి అక్రమాలకు పాల్పడిన అంశంపై పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం చేపట్టారు.

ANN TOP 10