కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ముఖ్యమంత్రిగా తనదైన దూకుడు ప్రదర్శిస్తున్న రేవంత్ రెడ్డి.. విదేశీ పర్యటనలోని కీలక సమావేశాల విషయంలోనూ తనదైన దూకుడిని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా… దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశాల్లో పాల్గొంటున్నారు.
రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. సోమవారమే దావోస్ చేరుకున్న ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు.
ఇందులో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్ తో పాటు నిర్వాహకులు, ఇతర ప్రముఖులతోనూ తెలంగాణ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో పాటు తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూ.. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. అనంతరం ఇథియోఫియా డిప్యూటీ ప్రధాన మంత్రి డెమెక్ హసెంటో తో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్ మ్యాప్ పై చర్చించారు. ఇదే సమయంలో… అసోషియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ ప్రెసిడెంట్ శ్రీమతి దేబ్జానీ ఘోష్ తోనూ సమావేశమయ్యారు.
ప్రధానంగా స్కిల్ డెవలప్ మెంట్ పై దృష్టిసారించే దిశగా చర్చలు జరిపారు. ఈ క్రమంలో… రాష్ట్రంలో స్కిల్ డెవెలప్మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించటంతోపాటు.. దానికోసం అనుసరించే మార్గాలపైనా ప్రధానంగా చర్చించారు. ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులు చదువుతున్న యువతకు స్కిల్ డెవెలప్మెంట్ సాయం అందించే అంశాలపై సంప్రదింపులు జరిపారు.
ఈ క్రమంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అధ్యక్షుడు బొర్గేబ్రెండెతో సోమవారం సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోని ‘ఎక్స్’ వేదికగా రేవంత్ షేర్ చేశారు. మనుషుల జీవన శైలి పరిస్థితులను మరింత మెరుగ్గా, సుసంపన్నంగా మెరుగుపరచేందుకు ప్రభుత్వాలు, వాణిజ్య సంస్థలు, ఇతర భాగస్వాములు ఏవిధంగా ఉమ్మడిగా పనిచేయగలవనే అంశంపై చర్చించినట్టు రేవంత్ వెల్లడించారు. మరోవైపు ఇథియోపియో డిప్యూటీ ప్రధానమంత్రి డెమెకే హసెన్‌ను కూడా కలిసినట్టుగా సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన పంచుకున్నారు.









