సంక్రాంతి పండగ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు కావడంతో నగర ప్రజలు భారీ సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లారు. జనవరి 13వ తేదీన 52.78 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. దీంతో ఆర్టీసీకి ఆ ఒక్కరోజే రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఏకంగా రూ. 12 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరోవైపు, మహిళలకు జారీ చేసే జీరో టికెట్లు 9 కోట్లు దాటినట్లు వెల్లడించారు. జనవరి 11న 28 లక్షల మంది, 12న 28 లక్షల మంది, 13న 31 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసినట్లు అధికారులు వివరించారు. పండగ సమయంలో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ముందు ఊహించిన ఆర్టీసీ అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ముందుగా 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని భావించింది. కానీ, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో జనవరి 11, 12, 13 తేదీల్లోనే 4400 ప్రత్యేక బస్సులను నడిపినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు మొత్తంగా 6261 ప్రత్యేక బస్సులను నడిపినట్లు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జగరకుండా ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు వివరించారు. కాగా, టీఎస్ఆర్టీసీ(TSRTC)ని ఆదరిస్తున్న, ప్రోత్సాహిస్తున్న ప్రతి ఒక్కరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ప్రతి పండుగ ప్రయాణంలో సంస్థ మీ వెన్నంటే ఉంటుంది. నాణ్యమైన, వేగవంతమైన సేవలందిస్తూ.. మిమ్మల్ని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతుంద అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.









