తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులను రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అధికారంలోకి వచ్చీ రాగానే అమెరికా కంపెనీ కార్నింగ్ హ్యాండ్ ఇవ్వడంతో అప్రమత్తమైన రేవంత్ సర్కారు అంతకు 30 రెట్లు ఎక్కువ పెట్టుబడితో ఫాక్స్‌కాన్‌ను రాష్ట్రానికి రప్పించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు మించిన ఇన్సెంటివ్‌లను ప్రకటించడంతోపాటు.. ఇతరత్రా అనేక విధాలుగా అండగా ఉంటామని ఫాక్స్‌కాన్‌కు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. అందులో భాగంగా పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకలతో పోటీ పడి.. రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల విలువైన ఫాక్స్‌కాన్ పెట్టుబడులను తెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఆపిల్ ఉత్పత్తులను తయారు చేసే ఈ తైవాన్ కంపెనీ తెలంగాణలో భారీ పెట్టుబడి పెడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ధీమాతో ఉంది. ఒకవేళ ఫాక్స్‌కాన్ గనుక పెట్టుబడి పెట్టేందుకు అంగీకరిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఇదే అతిపెద్ద పెట్టుబడి అవుతుంది.
ఫాక్స్‌కాన్‌కు కర్ణాటక, తమిళనాడుతో పోలిస్తే తాము మెరుగైన ఇన్సెంటీవ్లు ఇస్తున్నామని తెలంగాణ పరిశ్రమల శాఖ చెబుతోంది. దీంతో ఆ కంపెనీ హైదరాబాద్‌లో ఫెసిలిటీ ఏర్పాటుకు సుముఖంగా ఉందని పరిశ్రమల శాఖ చెబుతోంది. దేశంలో సెమీకండక్టర్లు, డిస్ప్లేల ఉత్పత్తిని పెంచడం కోసం భారత ప్రభుత్వం 2021 డిసెంబర్లో 50 శాతం రాయితీని ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం 30 శాతం ఇన్సెంటివ్స్ను ప్రకటించింది. మరోవైపు కర్ణాటక 20 శాతం, తమిళనాడు 25 శాతం చొప్పున ఇన్సెంటీవ్లను ప్రకటించాయని తెలుస్తోంది.
ఈ ఇన్సెంటీవ్తోపాటు అవసరమైతే కంపెనీలో 10 శాతం వాటా తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎలాగైనా సరే ఫాక్స్‌కాన్ పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించాలనే పట్టుదలతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం.. మైదరాబాద్ శివార్లలో వంద ఎకరాల భూమిని ఆఫర్ చేస్తోంది. విద్యుత్, నీటిని సబ్సిడీ ధరలకు అందిస్తామని.. ఆ ప్రాంతంలో ప్రాథమిక మౌలిక సదుపాయాలను తామే చూసుకుంటామని హామీ ఇస్తోంది.
పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అనుమతులన్నీ వెంటనే ఇస్తామని.. పరిశ్రమ పెట్టిన తొలి రోజు నుంచే పని చేసేలా టాస్క్ ద్వారా నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.









