AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొనసాగుతున్న రాహుల్‌ యాత్ర .. మణిపూర్‌ టు ముంబయి

ఇంఫాల్‌ : లోక్‌సభ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమవుతున్న సమయంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆదివారం భారత్‌ జోడో న్యారు యాత్రను ప్రారంభించారు. ముందుగా నిర్ణయించినట్టు మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో కాకుండా తౌబాల్‌ జిల్లాలోని ఓ ప్రయివేటు మైదానం నుంచి యాత్ర ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు. రాజ్యాంగ పీఠికను పరిరక్షించేందుకే యాత్రను చేపట్టినట్లు ఖర్గే చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఓట్లు అడిగేందుకే తప్ప ప్రజల బాధలు తెలుసుకునేందుకు మణిపూర్‌కు రారని ఆయన విమర్శించారు. యాత్ర ప్రారంభానికి ముందు రాహుల్‌ ఖాంగ్‌జామ్‌ వార్‌ మెమోరియల్‌ వద్ద అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, బీహార్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర సాగుతుంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో కాంగ్రెస్‌ పార్టీ పరాజయాన్ని మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో తిరిగి పూర్వ వైభవం సాధించేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని కాంగ్రెస్‌ భావిస్తోంది.
యూపీ పైనే దృష్టి
ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే రాహుల్‌ 28 లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. వాటిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసితో పాటు రాయబరేలి, అమేథీ, అలహాబాద్‌, ఫల్‌పర్‌, లక్నో కూడా ఉన్నాయి. అయితే ఇండియా కూటమి భాగస్వామ్య పక్షమైన సమాజ్‌వాదీ పార్టీకి మంచి పట్టున్న కన్నౌజ్‌, ఆజాంఘర్‌, ఎటావా, మెయిన్‌పురి, ఫిరోజాబాద్‌ స్థానాలలో రాహుల్‌ పర్యటన లేకపోవదం గమనార్హం. యూపీలో బీజేపీని ఎదుర్కోవడానికి సమాజ్‌వాదీ బలం సరిపోతుందని కాంగ్రెస్‌ అంచనా. సమాజ్‌వాదీ పార్టీ ప్రాబల్యం ఉన్న రాంపూర్‌, సంబల్‌, బదౌన్‌ స్థానాల మీదుగా మాత్రం రాహుల్‌ యాత్ర సాగుతుంది. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే రాహుల్‌ 11 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ రాష్ట్రంలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉండడంతో దీనిని కీలకమైనదిగా కాంగ్రెస్‌ భావిస్తోంది. అయితే గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ యూపీపై దృష్టి కేంద్రీకరించింది. చందౌలీ, వారణాసి, మచ్లీషహర్‌, ఫల్‌పర్‌, అలహాబాద్‌, భడోహీ, ప్రతాప్‌ఘర్‌, అమేథీ, రాయబరేలీ, లక్నో, మోహన్‌లాల్‌గంజ్‌, హర్దోరు, సీతాపూర్‌, ధౌరాహ్రా, షాజహాన్‌పూర్‌, ఓన్లా, బరేలీ, మొరాదాబాద్‌, రాంపూర్‌, సంబల్‌, అమ్రోహా, అలీఘర్‌, బదౌన్‌, బులంద్‌షహర్‌, హథ్రాస్‌, ఆగ్రా నియోజకవర్గాల మీదుగా రాహుల్‌ యాత్ర సాగుతుంది.

ఎస్సీ, ఎస్టీ స్థానాలపై కూడా…
యూపీ తర్వాత యాత్ర బెంగాల్‌, మహారాష్ట్రల్లోని ఎక్కువ నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. మహారాష్ట్రలో పది నియోజకవర్గాల్లో యాత్ర జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై కూడా కాంగ్రెస్‌ దృష్టి కేంద్రీకరిస్తోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన 13 ఎస్సీ, 17 ఎస్టీ స్థానాల్లో (మొత్తం 30 స్థానాలు) యాత్ర కొనసాగుతుంది. మణిపూర్‌, నాగాలాండ్‌ తర్వాత రాహుల్‌ యాత్ర అస్సాంలో ప్రవేశిస్తుంది. బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లో రాహుల్‌ పర్యటిస్తారు. బీహార్‌లో కొన్ని సిట్టింగ్‌ స్థానాల మీదుగా రాహుల్‌ యాత్రను నిర్వహిస్తారు. జార్ఖండ్‌లో బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు స్థానాల మీదుగా రాహుల్‌ యాత్ర సాగుతుంది. ఛత్తీస్‌గఢ్‌లో కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే రాహుల్‌ పర్యటిస్తారు . మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజరు సింగ్‌, కేంద్ర మంత్రి, ఒకప్పటి కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియాలకు కంచు కోటలుగా ఉన్న స్థానాల మీదుగా యాత్ర కొనసాగుతుంది. ఇది రాజకీయ యాత్ర కాదని, సైద్ధాంతిక యాత్ర అని కాంగ్రెస్‌ అంటోంది. హైబ్రిడ్‌ పద్ధతిలో చాలా వరకూ బస్సులో, కొంత దూరం నడుస్తూ రాహుల్‌ ఈ యాత్రను సాగిస్తారు. మొత్తంగా 15 రాష్ట్రాలు, 110 జిల్లాలు, 337 అసెంబ్లీ స్థానాలు, 100 లోక్‌సభ స్థానాల్లో 67 రోజుల పాటు రాహుల్‌ యాత్ర సాగుతుంది.

ANN TOP 10