AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడే మకర సంక్రాంతి.. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం

తెలుగు వాళ్ళు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. అచ్చనైన తెలుగుదనానికి ప్రతీకగా నిలిచే పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగ అనగానే మనకందరికీ గుర్తొచ్చేవి ముత్యాల ముగ్గులు, ముంగిట గొబ్బిళ్లు, హరిదాసుల పాటలు, బసవన్నల ఆటలు, ప్రతి ఇంట్లోనూ చేసే పిండి వంటలు, సందడి చేసే బంధువులు. అటువంటి సంక్రాంతి పండుగ నేడు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరుగుతుంది. సంబరాల సంక్రాంతికి తెలుగు రాష్ట్రాలలోని ప్రతీ గ్రామం స్వాగతం పలికింది. నిన్న భోగి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో భోగి వేడుకలు జరుపుకున్నారు. పాత సామాగ్రిని, పాత వస్తువులను భోగిమంటల్లో వేసి దహనం చేసి భోగి మంటల వెలుగుల్లో కొత్త క్రాంతికి స్వాగతం పలికారు తెలుగువారు. అగ్ని దేవుడికి, వాయు దేవుడికి హారతినిచ్చి, నైవేద్యాలు సమర్పించారు. భోగి భస్మాన్ని నుదుట ధరించి పండుగ చేసుకున్నారు.

చిన్నారులకు భోగి పళ్ళు పోసి పెద్దవాళ్లు మురిసిపోయారు. ఇక సంక్రాంతి పండుగ రోజు అంటే నేటి నుండి సూర్య భగవానుడు ఉత్తరాయణ ప్రయాణం ప్రారంభిస్తాడు. సూర్యుడు సంక్రాంతి రోజున మకర రాశిలోకి ప్రవేశించింది మొదలు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. నెల రోజులపాటు కొనసాగిన ధనుర్మాస ముగింపును గుర్తు చేస్తూ మకర సంక్రాంతి పండుగ వస్తుంది.

సంక్రాంతి అంటే సంక్రమణం అని అర్థం అంటే మారడం, వేరే చోటికి చేరుకోవడం సంక్రాంతి గా చెప్తారు. రైతులు చెమటోడ్చి పండించిన పంటలు చేతికొచ్చే సమయం సంక్రాంతి కాబట్టి ఇది రైతులందరికీ విశేషమైన పండుగ. పండుగ సందర్భంగా హరిదాసుల కీర్తనలు, బసవన్నల ఆటలు, జంగమ దేవరల విన్యాసాలు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడికి ప్రతీకగా కనిపిస్తాయి. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చే వారిని ఆదరించి సాధ్యమైనంత దానధర్మాలు చేసిన వారికి సంక్రాంతి పండుగ విశేషమైన ఫలితాలను ఇస్తుందని చెబుతారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పంట చేతికి వచ్చిన రైతులు సంతోషంగా కొత్త ధాన్యంతో పొంగలి చేసి, సూర్యభగవానుడికి నివేదించి, వివిధ రకాల పిండివంటలు తయారు చేసి, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.

ANN TOP 10