AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆఫ్ఘన్‌పై భారత్ ఘనవిజయం.. టీ20 సిరీస్ కైవసం

అఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న 3 మ్యాచుల టీ20 సిరీస్‌ను భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది. ఆదివారం ఇండోర్‌ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో అఫ్ఘాన్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్ఘాన్‌ సరిగ్గా 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్‌ అయింది. 8.5కి పైగా కావాల్సిన రన్‌రేట్‌తో బరిలోకి దిగిన భారత్.. యశస్వి జైశ్వాల్‌, శివమ్‌ దూబె హాఫ్‌ సెంచరీలతో చెలరేగడంతో కేవలం 94 బంతుల్లో జయభేరీ మోగించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకోవటంతో.. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్‌ 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ గుల్బాదిన్ (57) రాణించాడు. ఒకరిద్దరు మినహా మిగతా బ్యాటర్లు కూడా డబుల్ డిజిట్ స్కోర్లతో.. భారత్‌కు మంచి లక్ష్యాన్నే నిర్దేశించారు. అయితే.. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్ 3 వికెట్లు, రవి బిష్ణోయ్ 2, అక్షర్‌ పటేల్ 2, శివమ్‌ దూబె ఒక వికెట్ పడగొట్టారు.

ఇక అఫ్ఘానిస్థాన్‌ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 4 వికెట్లు కోల్పోయి 15.4 ఓవర్లలోనే ఛేదించింది. 14 నెలల తర్వాత ఈ సిరీస్‌తో టీ20ల్లోకి రీఎంట్రీ ఇచ్చిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. రెండో మ్యాచ్‌లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే మరో ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్ మాత్రం సిక్సులు, ఫోర్లతో చెలరేగిపోయాడు. 34 బంతుల్లో 68 రన్స్‌ చేశాడు. అందులో 5 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చిన కోహ్లీ 16 బంతుల్లో 29 రన్స్‌ చేశాడు. గత మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన శివమ్ దూబె.. తన ఫామ్‌ను కొనసాగించాడు. 32 బంతుల్లో 63 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచి.. జట్టును గెలిపించాడు.

ఈ మ్యాచ్‌ విజయంతో భారత్‌ రెండు మ్యాచులు ముగిసే సరికి 2-0తో లీడ్‌లోకి వెళ్లింది. నామమాత్రపు మూడో టీ20 మ్యాచ్‌ జనవరి 17న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.

ANN TOP 10