AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీ అలర్ట్‌.. పండక్కి ఊరెళ్తున్నారా.? అయితే జాగ్రత్తపడాల్సిందే..

పండక్కి ఊరెళుతున్నారా.. అయితే జాగ్రత్త. తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోయేందుకు పండగ దొంగలు సిద్దమవుతున్నారు. ఇప్ప‌టికే మూడు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో అంత‌రాష్ట్ర దొంగ‌ల ముఠాల క‌ద‌లిక‌లు బ‌య‌ట‌ప‌డ‌టంతో పోలీసులు అల‌ర్ట్ అయ్యారు. ఊరెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల కాకుండా ఉండాలంటే ప్ర‌జ‌లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

పండగ.. అందులో సంక్రాంతి వచ్చిదంటే చాలు ఎన్ని పనులున్నా పక్కనబెట్టి సొంతూరు వెళ్లాల్సిందే. దీంతో మూడు నుంచి వారంరోజుల పాటు ఇంటికి తాళమే. అయితే.. ఇప్పుడు ఈ తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్‌గా చేసే ముఠాలు సిటీలోకి ఎంటర్ అయ్యాయి. ప్రతీ రోజూ ఉదయం మధ్నాహ్నం సమయాల్లో రెక్కీలు నిర్వహించి తాళాలు వేసి ఉన్న ఇండ్లను గుర్తించటం రాత్రిళ్లు ఆ ఇండ్లను లూటీ చేయటం ఈ ముఠాల పని.

ప్ర‌తి సంవ‌త్స‌రం పండగ సెల‌వుల్లో అంత‌రాష్ట్ర ముఠాలు చోరీలు పోలీసులకు స‌వాల్‌గా మారాయి. ట్రైన్‌లో వ‌చ్చి ఒక్క రోజులోనే చోరీకి పాల్ప‌డి తిరిగి అదే ట్రైన్ ద్వార వెళ్లిపోతున్న ఘ‌ట‌న‌లు గతంలో చాల‌జ‌రిగాయి. దీంతో ఈ సారి పోలీసులు అంత‌రాష్ట్ర ముఠాల గ్యాంగ్ ల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించారు. రైల్వే స్టేష‌న్ లో ఏర్పాటు చేసిన ఫెషియ‌ల్ రిక‌గ్నాజేష‌న్ టెక్నాల‌జీ ద్వార అంత‌రాష్ట్ర ముఠాల క‌ద‌లిక‌ల‌పై దృష్టి సారించారు. దీంతో పాటు ప్ర‌తి రైల్వే స్టేష‌న్లో అనుమానితుల‌పై నిఘా పెట్టేందుకు ప్ర‌త్యేకంగా పోలీసుల‌ను మోహ‌రించారు.

దీంతో సంక్రాంతి పండగ సెలవుల్లో ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఉదయం వేళ రద్దీని, పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, తదితర వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టాలని కోరుతున్నారు. రాత్రివేళ అనుమానంగా కాలనీలో సంచరించేవారి గురించి పోలీసులకు సమాచారం అందించాలన్నారు. శివారు కాలనీలలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉద‌యం వేళ రెక్కి నిర్వ‌హించే స‌మ‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్నారు పోలీసులు.

ఇక ఊరు వెళ్ళేటప్పుడు ఖరీదైన వస్తువులను ఇంట్లో పెట్టకపోవటమే మంచిదని చెప్తున్నారు. వాటిని బ్యాంక్‌ లాకర్‌లో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇవ్వడం మంచిదని చెప్తున్నారు. ప్రత్యేకంగా చుట్టు పక్కల వారి ల్యాండ్‌ఫోన్‌, సెల్‌ఫోన్‌ నంబర్లు దగ్గర ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు సమీప పోలీస్‌స్టేషన్ల సంప్రదించాలని కొరుతున్నారు పోలీసులు.

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పరిధుల్లో నివసిస్తున్న ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని పోలీస్‌ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. పండుగ సమయంలో దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉండడంతో వారిని చైతన్యపరిచేందుకు కృషి చేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో కాలనీల్లో ఆటోల ద్వారా ప్రచారం చేస్తున్నారు. సూచనలు, జాగ్రత్తలకు సంబంధించి కరపత్రాల పంపిణీ, చౌరస్తాలు, ప్రధాన వీధులలో బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాలనీలు, బస్తీల్లో పెట్రోలింగ్‌, బ్లూకోట్స్‌, బీట్‌ కానిస్టేబుళ్లతో పెట్రోలింగ్ ను చేస్తున్నారు. పండుగకు స్వగ్రామాలకు వెళ్లే వారు వాట్సాప్‌ నెంబర్‌ 949061711, డయల్‌ 100కు సమాచారం ఇవ్వొచ్చని సూచిస్తున్నారు పోలీసులు.

ANN TOP 10