తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా పాలనకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల సందర్భంగా తమ పార్టీ తరపున ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తాను వీలైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తన కోసం ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం లేదని అధికారులకు ఆయన ఆదేశాల్సిన సంగతి తెలిసిందే.
తాజాగా తన కారుకు స్వయంగా పోస్టర్ అతికించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ జనవరి 14న మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో జోడో న్యాయ్ యాత్ర పోస్టర్ ను స్వయంగా తన కారుకు అతికించుకున్నారు రేవంత్. భారత ప్రజల హక్కులను, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ యాత్రను విజయవంతం చేయాలని దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.









