AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీకి షాక్‌.. పార్టీని వీడిన మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ కుమారుడు

లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీకి (BJP) ఆ పార్టీ నేతలు షాకిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఎనిమిది స్థానాల్లో గెలుపొందిన కమలం పార్టీ.. సార్వత్రిక ఎన్నికల్లోనూ మరింత పుంజుకోవాలని చూస్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి లోక్‌సభ నియోజకవర్గాల వర్గాలవారీగా ఇన్‌చార్జీలను ఇప్పటికే నియమించారు. అయితే తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంలేదంటూ అలకబూనిన నేతలు పార్టీని వీడుతున్నారు.

మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ కుమారుడు, హైదరబాద్‌లోని గోషామహల్‌ నేత విక్రమ్‌ గౌడ్ (Vikram Goud) బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డికి పంపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ సీటును ఆయన ఆశించారు. అయితే ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అప్పటివరకు ఉన్న బహిష్కరణ వేటును ఎత్తివేసిన పార్టీ.. వెంటనే ఆయనకు టికెట్‌ కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న విక్రమ్‌‌‌.. నాటినుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. నేడు పార్టీకి రాజీనామాచేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం.

విక్రమ్‌గౌడ్‌ బాటలోనే మరికొందరు నేతలు నడువనున్నట్లు తెలుస్తున్నది. మాజీ ఎమ్మెల్యేలు సినీనటి జయసుధ, ఆకుల రాజేందర్‌ సహా పలువురు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి రాజీనామా పత్రాలను సమర్పిస్తారని తెలిసింది. అనంతరం వీరు కాంగ్రెస్‌లో చేరుతారని సమాచారం.

ANN TOP 10