దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. గురువారం మధ్యాహ్నం సమయంలో రాజధాని నగరంతోపాటు సమీప ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.
ఢిల్లీతోపాటు పంజాబ్, చండీగఢ్, జమ్మూకశ్మీర్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో సుమారు 30 సెకన్లపాటు భూమి కంపించింది. ఈ భూకంపం ధాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు ఈ ప్రకంపనలతో ఇళ్లలోని ఫ్యాన్లు, ఇతర వస్తువులు ఊగిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పొరుగు దేశం పాకిస్థాన్లోనూ భూమి కంపించింది. లాహోర్, ఇస్లామాబాద్, ఖైబర్ ఫఖ్తుఖ్వా సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదైనట్లు పాకిస్థాన్ జియో న్యూస్ వెల్లడించింది.









