–తండ్రి వైఎస్సార్ కల నెరవేర్చేందుకే..
– ఏపీలోనే కాదు.. అండమాన్‌లోనైనా పనిచేస్తా
– మీడియాతో షర్మిల
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అదే సమయంలో తన పార్టీ వైఎస్సార్టీపీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు షర్మిల ప్రకటించారు. రాహుల్, ఖర్గేసహా కాంగ్రెస్ నేతలు ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
చాలా సంతోషంగా ఉంది..
అనంతరం షర్మిల కాంగ్రెస్ లో తాను చేరడంపై స్పందించారు. వైఎస్సార్ బిడ్డగా వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ లో విలీనం అవుతున్నారని ఆమె పేర్కొన్నారు. తన తండ్రి వైఎస్ బతికుండగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని, అందులోనే ఆయన అసువులుబాశారని షర్మిల గుర్తుచేశారు. వైఎస్సార్ బిడ్డగా తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. దేశ సెక్యులర్ పునాదుల్లో భాగమైన కాంగ్రెస్ పార్టీలో తాను భాగమవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.
దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్సేనని, అన్ని వర్గాలను కలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పనిచేస్తానని వైఎస్ షర్మిల తెలిపారు. తాను వైఎస్సార్ అడుగు జాడల్లో నడుస్తున్నట్లు షర్మిల తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నది తన తండ్రి వైఎస్సార్ కల అని, దాన్ని నెరవేర్చే యత్నంలో తాను భాగస్వామిని అవుతున్నందుకు షర్మిల సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రతీ ఒక్కరి ఆకాంక్షలు నెరవేరుస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీపై నమ్మకాన్ని తనతో పాటు ప్రజలందరిలో పెంచిందని షర్మిల తెలిపారు. మరోవైపు కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించి తెలంగాణలో పోటీ చేయలేదన్నారు.
అండమాన్‌లోనైనా పనిచేస్తా..
ఏపీలోనే కాదు అండమాన్‌లోనైనా పనిచేస్తా.. నని వైఎస్ షర్మిల అన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఎటువంటి బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తానని స్పష్టంచేశారు. ఏపీలోనే కాదు అండమాన్‌లోనైనా పనిచేయడానికి సిద్ధమని షర్మిల పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత షర్మిల, అనిల్ దంపతులు సోనియా గాంధీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.









