– గంటకు పైగా భేటీ
–ఏపీ, తెలంగాణ రాజకీయాలపై చర్చ!
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్∙మోహన్‌రెడ్డి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని జగన్ అడిగి తెలుసుకున్నారు. గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి జగన్ నేరుగా నందినగర్‌లో కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో జగన్‌కు బీఆర్‌ఎస్ నేతలు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కేసీఆర్ నివాసానికి జగన్ చేరుకున్నారు. కేసీఆర్ నివాసం వద్ద జగన్‌కు మాజీ మంత్రి కేటీఆర్ సాదర స్వాగతం పలికారు. స్వయంగా కేటీఆర్ జగన్‌ను తీసుకుని లోపలికి వెళ్లారు.
సీఎం జగన్ కేసీఆర్ కు పుష్పగుచ్ఛం అందించారు. ‘ఎలా ఉన్నారు సార్.. ఆరోగ్యం ఎలా ఉంది’ అని అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి, కేసీఆర్ మధ్య గంటకుపైగా సమావేశం జరిగింది. ఇరువురి నేతలు పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఏపీలో తాజా రాజకీయాలపై వీరి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం.
కాగా గత నెలలో కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో జారిపడటంతో ఆయన తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. దీంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. కొద్దిరోజులు వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రిలోనే కేసీఆర్ చికిత్స తీసుకున్నారు. డిసెంబర్ 15న బంజారాహిల్స్ నందినగర్ లోని ఆయన పూర్వ నివాసానికి వెళ్లారు. అక్కడే కొద్దిరోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే కేసీఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలు పార్టీల నేతలు, మెగాస్టార్ చిరంజీవి తదితరులు పరామర్శించారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ పరామర్శించారు. ఆయనతోపాటు వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్సీ రఘురాం తదితరులు ఉన్నారు. అయితే కేసీఆర్‌ను జగన్ మర్యాదపూర్వకంగానే కలిశారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. వారి మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయి అన్నది తెలియాల్సి ఉంది.









