AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మేడిగడ్డ.. అవినీతిదే అడ్డా

ప్రాజెక్టులో అన్ని లోపాలే..
వాస్తవాలు ప్రజలకు తెలియాలి
అందుకే మంత్రులందరం బ్యారేజీని పరిశీలించాం
మాకు ఎవరిమీద వ్యక్తిగత ద్వేషం లేదు
పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోవడం.. అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలలో బుడగలు రావడంపై.. ప్రాజెక్టు పనులలో ఏమి జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులో ఏమి జరిగిందో ప్రజలకు తెలియాలన్నారు. తమకు ఎవరి మీదా వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. ప్రాజెక్టులో అంతా అవినీతి, లోపాలే ఉన్నాయని, మూడు బ్యారేజీలు ఉన్నా తాగు, సాగునీటి సమస్యలున్నాయని శ్రీధర్‌ బాబు తెలిపారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టును శుక్రవారం మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ పరిశీలించారు. అనంతరం సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పాలనలో కట్టడాలు ఎలా జరిగాయి? అవి ఎందుకు పాడైపోయాయి? తెలంగాణ సంపదను సరైన విధానంలో ఖర్చు చేశారా? లేదా? అనే విషయాలపై సమీక్ష చేయడానికి వచ్చామని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలను తెలియజేస్తామన్నారు.

ప్రజలకు వివరిస్తాం..
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలన్నీ ప్రజలకు తెలియజేయాలని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో కొద్దిపాటి ముంపు సమస్యపై చర్చ జరిగిందని తెలిపారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రాణహిత ప్రాజెక్టును పక్కన పెట్టి మూడు బ్యారేజీలు కట్టారని చెప్పారు. రూ.38 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు నీరందే ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం కట్టారని అన్నారు. భారీ వ్యయం చేసి కట్టిన ప్రాజెక్టుల్లో లోపాలు ఎందుకు వస్తున్నాయని నిలదీశారు. దీన్ని తాము సీరియస్‌గా తీసుకున్నామని చెప్పారు.

దీనిపై వాస్తవాలు తెలుసుకునేందుకు పూర్తి సమాచారం తెలుసుకుంటున్నామని తెలిపారు. ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని తనిఖీ చేయడానికి వచ్చామని అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ డిజైన్‌ మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మించారని చెప్పారు. ప్రపంచంలో అద్భుతమైన ప్రాజెక్ట్‌ డ్యామేజీ కావడం బాధాకరమని అన్నారు.

ANN TOP 10