AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇతనికి మగవాళ్లంటేనే ఇష్టం.. వారికోసం దొంగతనాలు చేసి..

ఎక్కడ దొంగతనం చేసినా.. ఆ వివరాలన్నింటినీ అక్కడి యజమానికి తెలిసేలా చీటీ రాసి ఉంచి.. చోరీల్లోనూ నిజాయితీ ప్రదర్శిస్తున్న ఓ దొంగను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓయూ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ పారుపల్లి ఆంజనేయులుతో కలిసి ఏసీపీ సైదయ్య వివరాలను వెల్లడించారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా నాగర్లబండ తండాకు చెందిన రత్లావత్‌ శంకర్‌ నాయక్‌ (28) గద్వాల్‌లో బీఫార్మసీ చదువుతుండగా ఓ హత్యాయత్నం కేసులో 2012లో జైలుకు వెళ్లి వచ్చాడు. జైలు నుంచి విడుదలైన అనంతరం మద్యం, సిగరెట్లు, గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడి, రాత్రుళ్లు బయట తిరిగాడు. జల్సాలకు సంపాదన సరిపోకపోవడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. రెండు తెలుగు రాష్ర్టాల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో రాజేశ్‌ రెడ్డి, రంగారావు, లియాజ్‌ఖాన్‌ తదితర పేర్లతో చలామణి అయ్యాడు. కాలనీలు, వివిధ ప్రాంతాల్లో పగలు తాళం వేసి ఉన్న ఇళ్లను గమనించి, రాత్రి సమయంలో ఐరన్‌ రాడ్‌ సహాయంతో చాకచక్యంగా తలుపు తెరిచి దొంగతనాలు చేశాడు. 2022 సెప్టెంబర్‌లో మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోరీకి పాల్పడి, పోలీసులకు చిక్కడంతో పీడీ యాక్టు నమోదు చేసి, జైలుకు పంపారు. అప్పటికి అతడు చేసిన చోరీల సంఖ్య 94. మూడు నెలల కిందట జైలు నుంచి విడుదలైన శంకర్‌ నాయక్‌.. తన వైఖరిని మార్చుకోక ఎనిమిది దొంగతనాలు చేశాడు. వాటిలో మూడు ఓయూ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కాగా, మిగతావీ ఉప్పల్‌, కుషాయిగూడ, జడ్చర్ల టౌన్‌, సంగారెడ్డి రూరల్‌, నాగర్‌ కర్నూల్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కటి చొప్పన ఉండటం గమనార్హం.

ఓయూ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హబ్సిగూడ స్ట్రీట్‌ నంబర్‌ 5లో నివాసముండే లగిశెట్టి రాజు తన కుటుంబంతో సహా గత సెప్టెంబర్‌ 17న స్వగ్రామానికి వెళ్లాడు. తిరిగి 20న వచ్చి చూడగా.. ఇల్లు తాళం తీసి ఉండటంతో పాటు సామాన్లన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో నుంచి 19.1 తులాల బంగారు ఆభరణాలు, కొన్ని యూఎస్‌ డాలర్లు, కొంత నగదు చోరీకి గురైనట్టు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలను జల్లెడ పట్టి, విచారణ జరిపారు. ఈ క్రమంలో నిందితుడు మంగళవారం సాయంత్రం అమీర్‌పేటలో సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలించి, విచారించగా చేసిన నేరాలను ఒప్పుకున్నాడు. అతడి నుంచి ఇరవై తులాల బంగారు ఆభరణాలు, బైక్‌, మూడు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరుచనున్నట్లు చెప్పారు. నిందితుడిని పట్టుకున్న డీఐ శ్రీనివాసరావు, ఎస్సై యాసిన్‌ అలీ, ఏఎస్సై ఈశ్వర్‌, కానిస్టేబుళ్లు ప్రభాకర్‌, శ్రీను, నరేశ్‌, రమాకాంత్‌, కృష్ణను ఈ సందర్భంగా డీసీపీ సునీల్‌దత్‌ అభినందించారు.

ఆ ఇంట్లో ఏమీ దొరకకున్నా..
శంకర్‌ నాయక్‌ చోరీ విధానం చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. నిందితుడు ఎక్కడ చోరీ చేసినా.. అక్కడ దొంగతనం చేసిన వస్తువుల వివరాలను ఒక చీటీలో రాసి.. దొంగతనం చేసిన ప్రదేశంలోనే పెడుతాడు. చీటీ రాసేందుకు పేపర్‌ దొరకని పక్షంలో.. చోరీ సామగ్రి వివరాలను గోడపై రాస్తాడు. అంతేకాకుండా, అన్ని చోరీల వివరాలు, చోరీ చేసిన వస్తువుల వివరాలను కూడా ఎప్పటికప్పుడు డైరీలో పొందుపరిచాడు. గతంలో నిందితుడు ఓ ఇంటిలోకి చోరీకి వెళ్లగా అక్కడ ఎలాంటి వస్తువులు లభించలేదు. ఆ ఇంటి యజమాని మాత్రం ఐదు తులాల బంగారు ఆభరణాలు పోయినట్టు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తన నుంచి రికవరీ కూడా చేశారు.. అప్పటి నుంచి రాయడం అలవాటు చేసుకున్నానని శంకర్‌ నాయక్‌ చెప్పడం విశేషం.

మగవాళ్లతో చనువుగా ఉంటాడు..వారికోసం ఎంత డబ్బైన ఆ ఖర్చు…
శంకర్‌ నాయక్‌ మగవాళ్లతో చనువుగా ఉంటాడు. వారు ఎంత డబ్బు అడిగినా ఇవ్వడానికి దొంగతనాలు చేస్తాడు. విలాసవంతమైన జీవితం గడపటానికి అలవాటు పడ్డాడు. ఖరీదైన చెప్పులు, బట్టలు కొనుక్కుంటాడు. చేతిలో డబ్బంతా అయిపోగానే మళ్లీ రంగంలోకి దిగుతాడు. కొట్టేసిన సొత్తు వివరాలు ఓ డైరీలో రాయడం అలవాటు చేసుకున్నాడు. ఏ ఇంట్లో అయితే చోరీ చేశాడో అక్కడ కూడా ఓ స్లిప్‌మీద చోరీ చేసిన సొత్తు వివరాలు రాసేవాడు.

ANN TOP 10