సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా(South Africa) భారీ విజయం సాధించింది. పేసర్లు రబడ, బర్గర్ చెలరేగడంతో ఇన్నింగ్స్ 32 పరుగులతో టీమిండియా(Team India)పై గెలుపొందింది.163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ సేన 133 పరుగులకే కుప్పకూలింది. విరాట్ కోహ్లీ(76) ఒంటరి పోరాటం చేసినా ఇన్నింగ్స్ ఓటమి తప్పించలేకపోయాడు. జాన్‌సెన్ ఓవర్లో భారీ షాట్ ఆడిన కోహ్లీ.. బౌండరీ వద్ద రబాడ చేతికి చిక్కాడు. దాంతో ప్రొటిస్ జట్టు రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అరంగేట్రంలోనే బర్గర్ 7 వికెట్లతో మెరవగా.. రబడ కూడా ఏడు వికెట్లతో సత్తా చాటాడు.
తొలి ఇన్నింగ్స్‌లో భారత టాపార్డరను కకావికలం చేసిన రబాడ.. రెండో ఇన్నింగ్స్‌లోనూ తడాఖా చూపించాడు. అతడికి బర్గర్ తోడవ్వడంతో ఇండియా రెండు సెషన్లలోనే ఆలౌటయ్యింది. సఫారీలను 408 పరుగులకు కట్టడి చేసిన భారత్.. ఇన్నింగ్స్ ఆరంభమైన కాసేపటికే వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ(0)ను రబాడ డకౌట్ చేశాడు. ఆ కాసేటికే కుర్రాడు యశస్వీ జైస్వాల్(5)ను బర్గర్ సూపర్ డెలివరీతో బోల్తా కొట్టించాడు.
13 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన దశలో శుభ్‌మన్ గిల్(26), విరాట్ కోహ్లీ(18)లు ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ, జాన్‌సేన్ అద్భుతమైన బంతితో గిల్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై బర్గర్ రెచ్చిపోయాడు. వరుస బంతుల్లో సెంచరీ వీరుడు రాహుల్(4), అశ్విన్(0)లను ఔట్ చేసి హ్యాట్రిక్‌పై నిలిచాడు. ఠాకూర్(2)ను రబాడ ఔట్ చేసి రోహిత్ సేనను మరింత కష్టాల్లోకి నెట్టాడు. దాంతో, సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న భారత జట్టు ఇక సిరీస్ డ్రా చేసుకోవడంపై దృష్టి పెట్టనుంది.