తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల అభయ హస్తం కార్యక్రమం కింది దరఖాస్తులను ఈ రోజు నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి గోడ పత్రిక, దరఖాస్తు నమూనాలను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క నిన్న ఆవిష్కరించారు. నేటినుండి రాష్ట్ర వ్యాప్తంగా 12వేల 769 గ్రామ పంచాయతీలు, 3వేల 626 మున్సిపల్ వార్డులలో ప్రజాపాలన సదస్సులు నిర్వహించి దరఖాస్తులు తీసుకోనున్నారు. మొత్తం 16, 395 ప్రాంతాలలో ప్రజాపాలన సదస్సులు నిర్వహించనున్నారు .ఈ కార్యక్రమం నిర్వహణ కోసం 3714 అధికార బృందాలను ప్రభుత్వం రెడీ చేసింది.సుమారు పది శాఖలకు చెందిన అధికారులతో కూడిన బృందం రోజుకు రెండు గ్రామాలు లేదా రెండు వార్డులలో పర్యటించి ప్రజా పాలన సదస్సులు నిర్వహిస్తారు.
ఈనెల 31, జనవరి 1 సెలవు తేదీలు మినహాయించి మిగతా అన్ని రోజుల్లోనూ ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మళ్లీ మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నారు. ప్రజా పాలన సదస్సుల ద్వారా అభయ హస్తం కింద దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ప్రతి వంద మంది దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ వంతున ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ దరఖాస్తు ఫారంలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత ఐదు పథకాల వివరాలు ఇందులో ఉన్నాయి. ప్రతి పథకానికి వేరువేరుగా దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేకుండా, ఏ పథకానికి అర్హులైన వారు ఆ పథకానికి అవసరమైన వివరాలను మాత్రమే దరఖాస్తు ఫారంలో నింపాలి. అన్ని పథకాలకు అర్హులైన వారు ఒకే దరఖాస్తులు ఆయా వివరాలను నింపితే సరిపోతుంది. దరఖాస్తుదారులు దరఖాస్తు ఫారం తో పాటు, రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు దరఖాస్తుదారుని ఫోటోలు ఇవ్వాలి.