భారత్‌లో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల మార్క్‌ను దాటింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల మేరకు.. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 312 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,742 నుంచి 4,054కు పెరిగింది. ఇక తాజా కేసుల్లో అత్యధికంగా కేరళలో 128 కేసులు వెలుగుచూశాయి. నిన్న ఒక్క రోజే ఒక మరణం నమోదైంది. దీంతో మొత్తం కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,33కి చేరింది. ఇక 24 గంటల్లో 315 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4.44 కోట్లకు (4,44,71,860) చేరుకుంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.81 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,79,081) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.









