ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు పొందాలంటే అర్హత ఏంటన్న విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరాలు తెలిపారు. తాము అమలు చేసే 6 గ్యారంటీలకు తెల్లరేషన్ కార్డే అర్హతని చెప్పారు.
ఆయా పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభల ద్వారా స్వీకరిస్తామని తెలిపారు. పథకాల అమలుపై ఇవాళ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి పొంగులేటి మీడియాకు వివరాలు తెలిపారు.
ప్రభుత్వ 6 గ్యారంటీలకు సంబంధించి ముందుగా ప్రజలకు దరఖాస్తులు ఇవ్వనున్నట్లు చెప్పారు. గ్రామసభల్లో అధికారులకు దరఖాస్తులు అందజేసి, రసీదు తీసుకోవాలని వివరించారు. దరఖాస్తులను పరిశీలించి ఎవరు ఏ పథకానికి అర్హులో నిర్ణయిస్తారని చెప్పారు. 28 నుంచి నిర్వహించనున్న గ్రామసభలకు నిధులను రేవంత్ రెడ్డి విడుదల చేశారని తెలిపారు.
తాము ఆరు గ్యారంటీలలో రెండింటిని అమలు చేస్తున్నామని, మిగతా నాలుగు త్వరలోనే అమలు చేస్తామన్నారు. గత బీఆర్ఎస్ సర్కారులాగా పథకాల్లో కోతలు వంటివి పెట్టబోమని స్పష్టం చేశారు.