AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇంట్లో దూషిస్తే అట్రాసిటీ యాక్ట్ వర్తించదట.. అలహాబాద్ కోర్టు తీర్పు

బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో దూషించడం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం నేరం.. అయితే, నాలుగు గోడల మధ్య, ఇతరులు ఎవరూ లేనిచోట కులం పేరుతో తిట్టడం ఈ యాక్ట్ కిందకు రాదని అలహాబాద్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈమేరకు ఓ కాలేజ్ యజమానిపై నమోదు చేసిన అట్రాసిటీ కేసు చెల్లదని పేర్కొంది. బాధితుడి ఫిర్యాదు ప్రకారం ఈ ఘటన ఆఫీసులోని ఛాంబర్ లో జరిగిందని, అక్కడ ఇతరులు ఎవరూ లేరని గుర్తుచేసింది. బహిరంగ ప్రదేశాల్లో బలహీన వర్గాలకు చెందిన ప్రజలు అవమానాలకు గురికాకుండా కాపడడమే అట్రాసిటీ యాక్ట్ ఉద్దేశమని, అందువల్ల ఈ కేసులో అట్రాసిటీ యాక్ట్ లోని సెక్షన్ 3(1)(ఎస్) వర్తించదని స్పష్టం చేసింది.

కేసు వివరాలు..
యూపీలోని ఓ స్కూలులో 12వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఎగ్జాంలో ఫెయిలయ్యారు. దీంతో పిల్లలకు సరిగా చదువు చెప్పడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలు ముందు ఆందోళనకు దిగారు. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు సదరు స్కూలు యజమాని తమకు రూ.5 లక్షలు ఇవ్వజూపాడని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. మాట్లాడేందుకు పిలిచి తన క్యాబిన్ లో కులం పేరుతో దూషించాడని ఒక విద్యార్థి తండ్రి ఆరోపించాడు. స్కూలు యజమాని తీరుతో ఆవేదన చెందిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి యజమానిని కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈ కేసును అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ విచారించింది. ఈ కేసుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వర్తించదని తాజాగా తీర్పు వెలువరించింది.

ANN TOP 10