AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఒరిజనల్ గుర్తింపు కార్డు తప్పనిసరి.. మ‌హిళల‌కు టీఎస్ఆర్టీసీ కీల‌క సూచ‌న‌

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంద‌ని ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ పేర్కొన్నారు. అయితే బ‌స్సుల్లో ప్ర‌యాణిస్తున్న ప్ర‌తి మ‌హిళా ప్ర‌యాణికులు త‌ప్ప‌నిస‌రిగా త‌మ ఒరిజ‌న‌ల్ గుర్తింపు కార్డు చూపించాల్సిందేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

చాలా మంది గుర్తింపు కార్డుల ఫొటో కాపీలను తెస్తున్నారని, స్మార్ట్ ఫోన్‌ల‌లో సాప్ట్ కాపీలు చూపిస్తున్నారని స‌జ్జ‌నార్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్, డ్రైవింగ్, తదితర గుర్తింపు కార్డులను చూపించి జీరో టికెట్లను తీసుకోవాలని మహిళలను అధికారులు కోరారు. ఫొటో కాపీల‌ను స్మార్ట్ ఫోన్లలో చూపిస్తే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదు. గుర్తింపు కార్డుల్లోనూ ఫొటోలు స్పష్టంగా కనిపించాలి. చాలా మంది ఆధార్ కార్డుల్లో చిన్నతనం నాటి ఫొటోలు ఉన్నాయి. వాటిని అప్‌డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలకే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు విధిగా చార్జీలు చెల్లించి టికెట్ తీసుకోవాలి అని స‌జ్జ‌నార్ స్ప‌ష్టం చేశారు.

త్వరలో 2050 కొత్త బస్సులు
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగానే నాలుగైదు నెలల్లో దాదాపు 2050 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చే ప్లాన్ చేస్తున్నాం. అందులో 1050 డీజిల్.. 1000 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. విడతల వారీగా ఆ బస్సులు వాడకంలోకి వస్తాయ‌ని స‌జ్జ‌నార్ పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10