– ప్రాజెక్టుపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్
– రాష్ట్రానికి జరిగిన మేలెంత? నష్టం ఎంత? అవినీతి ఎంత?
– నిగ్గు తేల్చేపనిలో కాంగ్రెస్ సర్కార్
– జుడిషియల్ విచారణతో పాటు.. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు రంగం సిద్ధం
– నేడు అసెంబ్లీలో జరిగే చర్చపై సర్వత్రా ఉత్కంఠ
బీఆర్ఎస్ సర్కార్‌లో ఏం జరిగింది? చెప్పింది ఏంటి? చేసిందేమింటి? కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి జరిగిన మేలెంత? నష్టం ఎంత? అందులో అవినీతి ఎంత అన్నది ప్రజల ముందు ఉంచేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతోంది. అందులో భాగంగానే జుడిషియల్ విచారణతో పాటు.. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ సిద్ధమవుతున్నారు.
కాళేశ్వరం నిర్మాణం సమయంలో మాజీ సీఎం కేసీఆర్.. అప్పటి అసెంబ్లీలో ఏ విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారో.. ఇప్పుడు సేమ్ టు సేమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని సీఎం డిసైడ్ అయ్యారు. ఏ వేదికపై నుంచి ప్రాజెక్టు గొప్పతనం చెప్పారో.. అదే వేదికలో అందులో డొల్లతనం వివరించాలని అనుకుంటున్నారు సీఎం. దీంతో శనివారం ఏ విధంగా అసెంబ్లీలో వాడివేడి సంవాదం చోటు చేసుకుందో.. అంతకు మించిన రక్తి కట్టించే సన్నివేశాలకు బుధవారం అసెంబ్లీ వేదిక కాబోతోందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరా తీస్తోంది. మరోవైపు ఎల్ అండ్ టీ ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమై సుదీర్ఘ చర్చించారు. మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేసేది లేదని ఎల్ అండ్ టీ స్పష్టం చేయండంతో ఆ సంస్థ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని వృథా చేసిన వారిని వదిలి పెట్టబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు కూడా.
అప్పటి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ మానస పుత్రికగా తీసుకుంటూ దాదాపు రూ.2లక్షల కోట్లకు పైగా వెచ్చించి నిర్మించారు. కానీ నిర్మించిన కొన్నేళ్లకే మేడిగడ్డ బ్యారేజ్ లోని కొన్ని పిల్లర్లు కుంగిపోవడం తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ పూర్తి స్థాయి విచారణ చేపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే చెప్పారు. ఈ మేరకు కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని నీటి పారుదల శాఖ అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లు, అప్పటి మంత్రులను, అధికారులను శిక్షిస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక.. పరిపాలనపై పట్టు సాధిస్తున్నారు. ప్రభుత్వంలో ప్రక్షాళనకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల్లో తన మార్క్ చూపిస్తున్నారు. గత సర్కార్ వైఫల్యాలను తవ్వితీస్తూ.. అవే బీఆర్ఎస్పై పోరాటానికి అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. గత ప్రభుత్వంలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలంటే న్యాయ విచారణ జరిపించడం ఒక్కటే మార్గమన్న చర్చ సాగుతోంది. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం బీఆర్ఎస్ పార్టీ అగ్ర నేతలకు ఉచ్చు బిగిసుకోవడం ఖాయమని పలువురు పరిశీలకులు భావిస్తున్నారు.









