AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క.. త్వరలో 14 వేల పోస్టుల భర్తీ, ఈ శాఖలోనే..

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కొలువుల భర్తీపై నిరుద్యోగులు కోటి ఆశలు పెట్టుకున్నారు. కొత్త ప్రభుత్వంలో తమకు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14 వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. సోమవారం ములుగులోని సఖీ కేంద్రం ఆవరణలో రూ.1.35 కోట్లతో మంజూరైన బాలసదనం భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సీతక్క.. రాష్ట్రంలో 4 వేల మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్‌ చేసి అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకం గురించి ఆటో డ్రైవర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వారి సంఘాలతో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కమిటీ చర్చించిన తర్వాతే హామీని ప్రకటించామని చెప్పారు. ఆటోడ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రకియ చేపట్టనున్నట్లు చెప్పారు.

7,094 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5,204 స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు అదనంగా 1,890 కలిపి మొత్తం 7,094 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. గతేడాది డిసెంబరు 30న 5,204 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కాగా.. దీనికి అదనంగా మరో 1,890 పోస్టులను కలిపి మొత్తం 7,094 పోస్టులను రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక మండలి ద్వారా భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. జోన్ల వారీగా పోస్టుల వివరాలు వెల్లడించారు. కాగా, జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి ఏడాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే అందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించింది.

ANN TOP 10