ఆర్థిక సంక్షోభం ఉన్నా హామీలన్నీ అమలు చేస్తాం
మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
ఆరు గ్యారంటీల అమలుపై రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తుండగా.. సంక్రాంతికి మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే.. డిసెంబర్ 9న రెండు గ్యారంటీలను అమలు చేశామని, మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. చేయూత పథకం కింద రూ. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా సౌకర్యాన్ని కల్పించామన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని.. ప్రజా సంక్షేమ ప్రభుత్వమని చెప్పారు. అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని స్పష్టం చేశారు. ఆర్థిక సంక్షోభం ఉన్నా.. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ధరణిలో తప్పులు ప్రక్షాళన చేసి నష్టం లేకుండా చేస్తామన్నారు. వీఆర్‌ఏల సమస్యలపై యూనియన్లతో చర్చించి న్యాయం చేస్తామన్నారు.









