యాదాద్రి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) మాట్లాడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమైన శాఖలు జిల్లా మంత్రుల దగ్గరే ఉన్నాయన్నారు. 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని మరోసారి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోటగా నిరూపితమైందన్నారు. డిసెంబర్ 3న నిజమైన తెలంగాణ సిద్ధించిందన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. నల్గొండ అభివృద్ధి తమ లక్ష్యమని.. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.









