తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కాబోతోంది. ఇవాళ జరగబోయే ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. పార్టీలో అత్యున్నత నిర్ణయక మండలి అయిన పీఏసీ ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో ప్రధానంగా నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీల నియామకంపై చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తరవాత జరుగుతున్న సమావేశం అయినందున ముఖ్య నాయకులకు కీలక బాధ్యతలను అప్పగించేలా చర్చించే అవకాశం ఉందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే కొత్త డీసీసీల నియామకాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పార్టీ మరింత బలోపేతానికి తగిన చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
ఎన్నికల ముందు ఏ విధంగా పార్టీ పని చేసిందో, అలానే మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేసేలా నాయకుల మధ్య చర్చ జరగనుందనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. రాష్ట్రంలో 17ఎంపీ సీట్లలో వీలైనన్ని ఎక్కువ సీట్లను హస్తగతం చేసుకునేందుకు రోడ్‌మ్యాప్ రూపకల్పనపై పీఏసీ దృష్టి సారించనుంది. అంతే కాకుండా పది రోజుల పాలన పరమైన అంశాల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలు అవుతున్నాయో లేదో తెలుసుకోవడంతో పాటు.. ఆ పథకాల వల్ల ప్రజలకు లాభం జరగుతుందో లేదో తెలుసుకునేలా జిల్లా స్థాయిలో నాయకులను ఏర్పాటు చేసేందుకు ఈ మీటింగ్‌లో చర్చించబోతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇక ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల అంశంపై హైకమాండ్‌తో రేవంత్ చర్చిస్తారని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. పదవుల పంపిణీ ద్వారా పార్టీలో జోష్ తేవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అందులో హోం శాఖతో పాటు పలు కీలక శాఖలు ఉన్నాయి. ప్రస్తుత కేబినెట్ లో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో సామాజిక సమీకరణాలతో పాటు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కేబినెట్ కూర్పు చేపట్టేలా పార్టీ అధిష్టానంతో చర్చలు జరపనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.









