– మరో ముగ్గురికి అవకాశం
– పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్
– అధిక సీట్ల కోసం రేవంత్ వ్యూహం
– నేడో, రేపో హస్తినకు సీఎం
– కాంగ్రెస్ పెద్దలతో సమావేశం
– నామినేటెడ్ పదవులపైనా చర్చ జరిగే అవకాశం
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు మంత్రి పదవులు ఇచ్చి రంగంలోకి దింపాలని చూస్తోంది. ఇందుకోసం నేడో, రేపో సీఎం రేవంత్రెడ్డి హస్తినకు బయలుదేరివెళ్తున్నారు.
తెలంగాణలో ఉన్న 17 స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఎంపిక చేసిన స్థానాల్లో ముఖ్యమైన నేతలను బరిలో దింపేందుకు వ్యూహం రచిస్తోంది. వారిని ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు రాబట్టాలనే వ్యూహం రచిస్తున్నారు సీఎం రేవంత్.
ఆ ముగ్గురి పేర్లు..
ఈసారి కాంగ్రెస్ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో బరిలో నిలిచే ముగ్గురు నేతలపై జోరుగా చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని అద్దంకి దయాకర్ ను కేబినెట్ లోకి తీసుకుని వరంగల్ పార్లమెంట్ బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని చూస్తున్న ఫిరోజ్ ఖాన్ కు సైతం మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్నారు.
ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును మంత్రివర్గంలోకి తీసుకుని మల్కాజ్ గిరి పార్లమెంటు బరిలోకి దింపేందుకు వ్యూహం రచిస్తోంది. ఈ ముగ్గురు నేతలను కేబినెట్ లోకి తీసుకునే అంశం పార్టీ అధిష్టానంతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ ముగ్గురు నేతలను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే సత్ఫలితాలపై పార్టీ పెద్దలకు వివరించనున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఎన్నికల్లో గెలుపుతో మంచి ఊపుమీదున్న కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల విషయంలోనూ భారీ కసరత్తే చేస్తోంది.
19న పార్టీ పెద్దలతో రేవంత్ భేటీ..
ఈ నెల 19న ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో రేవంత్ సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ..నామినేటెడ్ పదవుల పైనా∙రేవంత్ చర్చించనున్నారు. లోక్ సభ అభ్యర్థుల విషయంలోనూ ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
రేవంత్ కీలక నిర్ణయాలు..
రేవంత్ రెడ్డి పార్టీలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీలో ముఖ్య నిర్ణయాలకు హైకమాండ్ అనుమతితోనే అమలు చేయనున్నారు. ఈ క్రమంలో భాగంగా మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ సారి ఢిల్లీ పర్యటనలో పూర్తిగా పార్టీ పరంగా నియామకాలకు సంబంధించిన చర్చలు..ఆమోదం తీసుకోనున్నట్లు సమాచారం. తెలంగాణ మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం ఉంది. వారి కోసమే కొన్ని ప్రధాన శాఖలను పెండింగ్ పెట్టారు. అందులో హోం శాఖతో పాటుగా విద్య, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ వంటి కీలక శాఖలు ఉన్నాయి. ప్రస్తుత కేబినెట్ లో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. మిగిలి ఉన్న ఆరు స్థానాలకు 15 మంది పోటీ పడుతున్నారు. ఇందులో ఎమ్మెల్యేలుగా ఓడిన వారూ ఉన్నారు.
అంజన్ కుమార్ యాదవ్, మధుయాష్కి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్ కు మంత్రులుగా అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తారని సమాచారం. చెన్నూరులో గెలిచిన వివేక్ కేబినెట్ బెర్త్ కోసం సోనియాను కలిశారు. రేవంత్ తనకు అవకాశం ఇస్తారని వివేక్ నమ్మకం తో ఉన్నారు. నిజామాబాద్ నుంచి షబ్బీర్ అలీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మొత్తానికి లోక్ సభ ఎన్నికల సమయంలో హస్తం పార్టీకి భారీ హైప్ తీసుకొచ్చేందుకు ముఖ్యులను క్యాబినెట్ లోకి తీసుకోవాలన్న ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు సమాచారం.









