కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతన్న క్రమంలో వివిధ శాఖల్లో ఫైళ్ల గల్లంతు, ధ్వంసంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఫైళ్ల నిర్వహణపై ముఖ్య కార్యదర్శలు, శాఖాధిపతులకు విధి విధానాలు జారీ చేసింది. ఫైళ్ల గల్లంతు, ధ్వంసం విషయంలో బాధ్యులైన అధికారులను క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ క్రమంలో శాఖలవారీగా ఫైళ్ల వివరాలను నమోదు చేయాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఫైల్ మాయమైతే సంబంధిత అధికారులపై క్రిమనల్, శాఖపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఫైళ్ల నిర్వహణపై డిసెంబర్ 18లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వివిధ శాఖల్లోని కీలక ఫైళ్లను కొందరు అదికారులు గల్లంతు, ధ్వంసం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫర్నీచర్ తోపాటు ఫైళ్లను కూడా ఎత్తుకెళ్లే ప్రయత్నం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో గత ప్రభుత్వంలో పనిచేసిన కొందరు అధికారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఫలితాలకు ఒక్క రోజు ముందు టూరిజం కార్పొరేషన్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఫర్నీచర్ తోపాటు పలు కీలక ఫైళ్లు కూడా కాలిపోయాయి. దీంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం వరుస ఘటనలపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 15వ తేదీ శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, పోలీస్ శాఖపై సీఎం సమీక్షించారు.
పారదర్శకంగా, అవకతవకలు లేకుండా పోలీస్ పోలీస్ నియామకాలు చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఇప్పటి వరకూ చేపట్టిన పోలీసు నియామకాలపై నివేదిక ఇవ్వాలని చెప్పారు. వెంటనే హోంగార్డు నియామకాలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ విధుల్లో హోంగార్డులను ఉపయోగించుకోవాలని సూచించారు. పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు రెసిడెన్సీ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. తెలంగాణ కోసం నళిని తన ఉద్యోగానికి రాజీనామా చేశారని.. ఆమెకు ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉంటే వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు సీఎం రేవంత్. నళినికి అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి పోలీసు శాఖలో నిబంధనలు అడ్డు వస్తే.. ఇతర ఉద్యోగం ఇవ్వాలని స్పష్టం చేశారు. నళినికి అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాగా, తెలంగాణ ఉద్యమ సమయంలో డీఎస్పీ నళిని తన ఉద్యోగాన్ని వదులుకున్న విషయం తెలిసిందే.









