రాష్ట్ర భారీ నీటిపారుదల, సివిల్ సప్లయిస్ మంత్రిగా హుజూర్‌నగర్ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయ నాలుగో అంతస్థులోని కార్యాలయంలో బాధ్యతల స్వీకార కార్యక్రమం పూర్తి చేశారు. ఈ సందర్భంగా యర్రవరం దేవాలయ అర్చకులు నర్సింహమూర్తి, వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య బాధ్యతలు స్వీకరిస్తూ ఫైల్‌పై సంతకం చేశారు. అనంతరం అసెంబ్లీలో హుజూర్‌నగర్ శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సోనియా, రాహుల్‌గాంధీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.
రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించినందుకు అండగా ఉంటానన్నారు. ఎన్నికల హామీలను అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతానన్నారు. దశాబ్ద కాలం ప్రజలకు అండగా ఉన్న నాయకులు, కార్యకర్తలను ఆదుకుంటానన్నారు. కాగా కార్యక్రమంలో ఉత్తమ్ సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఐడీసీ మాజీ డైరెక్టర్ సాముల శివారెడ్డి, టీపీసీసీ సలహాదారులు సాముల జైపాల్‌రెడ్డి, కుందూరు శ్రీనివా్‌సరెడ్డి, సింగారపు సైదులు, చక్కెర వీరారెడ్డి, అరుణ్‌కుమార్, గూడెపు శ్రీనివాస్, శివరామ్‌యాదవ్, కోట రామిరెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందించారు.









