– వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్
– కాంగ్రెస్ నిర్ణయం.. బీఆర్‌ఎస్ మద్దతు
– ఏకగ్రీవ ఎన్నిక.. రేపు అధికారిక ప్రకటన
తెలంగాణ నూతన అసెంబ్లీకి కొత్త స్పీకర్ ఖరారయ్యారు. కొత్తగా కొలువుదీరనున్న శాసనసభకు కాంగ్రెస్ పార్టీ తరఫున స్పీకర్ అభ్యర్థిగా మాజీ మంత్రి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. స్పీకర్ పదవికి ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేశారు. ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ ఎమ్మెల్యే కేటీఆర్ నామినేషన్‌పై సంతకం చేశారు. కొత్తగా కొలువైన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా ప్రసాద కుమార్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. రేపు (గురువారం) ఎన్నిక పైన అధికారిక ప్రకటన చేయనున్నారు. ఆ వెంటనే ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. గడ్డం ప్రసాద్ స్పీకర్‌గా నియమితులైతే తెలంగాణ రాష్ట్రానికి తొలి దళిత స్పీకర్ ఆయనే కానున్నారు. ప్రస్తుత శాసన సభలో అత్యధిక మంది సభ్యులు అగ్రకులాలకు చెందిన వారేనన్న సంగతి తెలిసిందే. సభలో వారికి మాట్లాడే అవకాశం ఇచ్చే, వారిని నియంత్రించే అధికారాలు కలిగిన స్పీకర్ పదవిని దళిత నేతకు ఇస్తున్నామన్న భావనను ప్రజల్లోకి పంపేందుకే కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలని ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బీఆర్‌ఎస్ పార్టీ అధినేత , పార్టీ శాసన సభానేత కేసీఆర్‌ను కోరడం, వారు సమ్మతించటం మరోవైపు ఎంఐఎం నేత పార్టీ సైతం మద్దతు ఇస్తున్న నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది.
వైఎస్, కిరణ్‌కుమార్ కేబినెట్‌లో మంత్రిగా..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో జన్మించిన ప్రసాద్… 2008 ఉపఎన్నికలో వికారాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2012లో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు. 2014, 2018 ఎన్నికల్లో ఆయన వరుసగా ఓటమిపాలయ్యారు. అయితే 2022లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన వికారాబాద్ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు స్పీకర్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు.









