AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లోక్‌సభలో దుండగుల కలకలం

– టియర్‌ గ్యాస్‌ వదిలిన ఆగంతకులు
– పబ్లిక్‌ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన వైనం
– భయంతో పరుగులు తీసిన ఎంపీలు
– నిందితులను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది
– భద్రతా వైఫల్యమే కారణం

పార్లమెంట్‌ సమావేశాల వేళ లోక్‌సభలో కలకలం రేగింది. లోక్‌ సభలోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. సభలో టియర్‌ గ్యాస్‌ వదిలి భయాందోళన సృష్టించారు. ఈ గందరగోళంతో ఎంపీలు భయపడి పరుగులు తీశారు. కొందరు ఎంపీలు వారిని పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. లోక్‌ సభ సెక్యూరిటీ వైఫల్యం వల్లే దుండగులు లోపలికి ప్రవేశించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిటర్స్‌ గ్యాలరీ నుంచి సభ్యుల మధ్యలోకి దూకి ముందుకు దూసుకెళ్లారు. కాగా, 2001 లో ఇదే రోజు పార్లమెంట్‌ పై దాడి జరిగింది. ఈ దాడికి నేటితో 22 ఏళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా ఇదే రోజు ఆగంతకులు లోక్‌ సభలో చొరబడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇద్దరు యువకులు లోక్‌ సభలోకి చొరబడి ఎంపీలపై టియర్‌ గ్యాస్‌ వదలారు. దుండగుల వద్ద ఆయుధాలు కూడా ఉండి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత భద్రత ఉండే పార్లమెంట్‌ ఆవరణలోకి ప్రవేశించడమే కష్టం కాగా.. ఈ దుండగులు ఇద్దరు పార్లమెంట్‌ లోపలికి ప్రవేశించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఈ అనూహ్య పరిణామంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు.

సరిగ్గా 22 ఏళ్ల క్రితం..
సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజు భారత పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. పార్లమెంట్‌ ప్రాంగణంలో జరిగిన ఈ దాడిలో తొమ్మిది మంది అమరులయ్యారు. ఈ వార్షికోత్సవం రోజునే మరోసారి పార్లమెంట్‌లో భద్రత వైఫల్యం చోటుచేసుకుంది. అమరుల సంస్మరణ సభ ముగిసిన కాసేపటికే సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో విజిటర్స్‌ గ్యాలరీ నుంచి చాంబర్‌లోకి నిందితులు దూకడంతో కలకలం రేగింది. యువకుడితో పాటు ఓ మహిళను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మైసూర్‌ ఎంపీ ప్రతాప్‌ పాస్‌లతో పార్లమెంట్‌లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. ‘తానా షాహీ బంద్‌ కరో.. భారత్‌ మాతాకీ జై’ అనే నినాదాలు చేశారు.

తాజా ఘటనపై కాంగ్రెస్‌ ఎంపీ చిదంబరం మాట్లాడుతూ.. ‘సభలో జీరో అవర్‌ జరుగుతోంది, నేను మాట్లాడేందుకు నా వంతు కోసం వేచి ఉన్నాను. అకస్మాత్తుగా, సందర్శకుల గ్యాలరీ నుంచి ఒకరు పడిపోయినట్లు కనిపించింది. అతను దూకడం ఉద్దేశపూర్వక చర్య అని అప్పుడు మాకు అర్థమైంది. మరొక వ్యక్తి ఉన్నారు.. ఇద్దరూ టియర్‌ గ్యాస్‌ను డబ్బాలను బయటకు తీసి వెదజల్లారు’ అని పేర్కొన్నారు. ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

ANN TOP 10