ఏళ్లుగా బిల్లులు చెల్లించని బీఆర్‌ఎస్ ప్రభుత్వం..
సీఎం రేవంత్‌రెడ్డికి విద్యుత్ శాఖ నివేదికలో వెల్లడి
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన కరెంటు బిల్లుల మొండి బకాయిలు రూ.28,140 కోట్లు. కేంద్ర ప్రభుత్వ విభాగాలు బకాయిపడిన రూ.721 కోట్ల కరెంటు బిల్లులను కూడా కలుపుకుంటే.. మొత్తం బకాయిలు రూ.28,861 కోట్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ 4వ తేదీ నాటికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.1,268 కోట్లు మాత్రమే ఉండగా, ఆ తర్వాత ఏటేటా భారీగా పెరిగిపోయాయి. కాళేశ్వరం తదితర ఎత్తిపోతల పథకాలు, తాగునీటి సరఫరా పథకాలు, వీధి దీపాల నిర్వహణకు వాడుకున్న కరెంటుకు సంబంధించిన బిల్లులను విద్యుత్‌శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో విద్యుత్ రంగం పరిస్థితిపై శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
సాగు, తాగు నీటి పథకాల బకాయిలు
కాళేశ్వరంతో పాటు రాష్ట్రంలోని ఇతర ఎత్తిపోతల పథకాల నిర్వహణ కోసం వాడిన కరెంటు బిల్లుల బకాయిలే రూ.14,172 కోట్లు ఉండటం గమనార్హం. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఎత్తిపోతల పథకాల కరెంటు బకాయిలు రూ.103 కోట్లు మాత్రమే. ఇక మిషన్ భగీరథ అమలుకు వాడిన రూ.3,559 కోట్ల కరెంటు బకాయిలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజీ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్ అండ్‌ఎ్‌సబీ/జలమండలి) వాడిన రూ.3,932 కోట్ల బకాయిలు కూడా ఏళ్లుగా పేరుకుపోయాయి. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు నల్లా నీళ్లను ఉచితంగా సరఫరా చేస్తుండటంతో ఆదాయం కోల్పోయిన జలమండలి విద్యుత్ బిల్లులను చెల్లించలేక చేతులెత్తేసింది. మిషన్ భగీరథ నీళ్లను సైతం గ్రామాల్లో ఉచితంగానే సరఫరా చేస్తుండటంతో ఆ విభాగం కూడా ఆదాయం లేక కరెంట్ బిల్లులను చెల్లించలేకపోయింది.
రూ.5,176 కోట్ల కరెంటు బిల్లుల నిధుల దారి మళ్లింపు
గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లుల చెల్లింపులకు సంబంధించిన రూ.3993 కోట్ల నిధులను పంచాయతీరాజ్ శాఖ ఖాతా నుంచి, మున్సిపాలిటీల విద్యుత్ బిల్లుల చెల్లింపులకు సంబంధించిన రూ.1183 కోట్లను రాష్ట్ర పురపాలక శాఖ ఖాతా నుంచి.. మొత్తం రూ.5,176 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాకు దారి మళ్లించింది. ఈ నిధులు రాజ్యాంగ నిబంధనల ప్రకారం స్థానిక సంస్థలకు కేంద్రప్రభుత్వం అందజేసిన నిధులని తెలుస్తోంది. ఈ విధంగా వివిధ ప్రభుత్వ విభాగాల బకాయిలు రూ.23,685 కోట్లు (కేంద్ర ప్రభుత్వ విభాగాల బకాయిలు రూ.721 కోట్లతో కలిపి), దారి మళ్లించిన కరెంట్ బిల్లులు రూ.5,176 కోట్లు కలిపితే మొత్తం బకాయిలు రూ.28,861 కోట్లకు చేరాయని విద్యుత్ శాఖ ముఖ్యమంత్రికి నివేదించింది.
డిస్కంలపై పెను భారం
ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను విద్యుత్ బిల్లుల మొండి బకాయిలు మరింతగా కుంగదీస్తున్నాయి. ప్రభుత్వ బకాయిలతోనే ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (టీఎ్‌సఎన్పీడీసీఎల్/ టీఎ్‌సఎస్పీడీసీఎల్) ఏకంగా రూ.50,275 కోట్ల భారీ నష్టాలను మూటగట్టుకున్నాయని విద్యుత్ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వంనుంచి రూ.28,140 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలు రావాల్సి ఉండగా, మరో రూ.12,515 కోట్ల ట్రూఅప్ చార్జీలను సైతం రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడింది. ఈ రెండింటినీ కలిపితే డిస్కంలకు రావాల్సిన మొత్తం బకాయిలు రూ.40,655 కోట్లకు చేరుకుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లిస్తే డిస్కంల నష్టాలు రూ.9,620 కోట్లకు తగ్గిపోతాయి. వాస్తవానికి రూ.12,515 కోట్ల ట్రూఅప్ చార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు విద్యుత్ శాఖ ప్రయత్నించగా, ఇంతకు ముందటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతించలేదు. ప్రభుత్వమే వచ్చే ఐదేళ్లలో విడతల వారీగా చెల్లిస్తుందని హామీ ఇచ్చింది. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి చెల్లింపులు జరపలేదని విద్యుత్ శాఖ సీఎం రేవంత్‌రెడ్డికి ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో వెల్లడించింది.









