న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేపట్టింది. మంగళవారం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో (AICC Chief Mallikarjuna Kharge) కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ అయి.. ఎమ్మెల్యేల ఏకవాక్య తీర్మానాన్ని అధిష్టానానికి అందజేశారు. అయితే రేవంత్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో రేవంత్ సీఎం అభ్యర్ధిత్వంపై డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. రేవంత్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తన అనుయాయుల వద్ద డీకే శివకుమార్ వెల్లడించినట్లు సమాచారం. కొత్తగా పార్టీలోకి వచ్చిన రేవంత్‌ను సీఎం ఎలా చేస్తారని కొంతమంది సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని… పార్టీలో సీనియర్ అయిన తనను కాదని సిద్దరామయ్యను సీఎంను చేయలేదా అంటూ ఆయన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సిద్దరామయ్య కూడా రేవంత్ లాగానే వేరే పార్టీ నుంచి వచ్చిన వారేననని పేర్కొన్నారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మాత్రం రేవంత్ పేరే చెప్పారని అనుయాయుల వద్ద డీకే శివకుమార్ చెప్పినట్లు తెలుస్తోంది.









