కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతల పోటాపోటీ పాదయాత్రలు గుబులు రేపుతోన్నాయి. ఇప్పటికే గత కొంతకాలం నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తోండగా.. ఆయనకు పోటీగా పార్టీలోని కొంతమంది సీనియర్లు పాదయాత్రలకు దిగుతున్నారు. ఇప్పటికే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర చేస్తోండగా.. త్వరలో భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టబోతున్నారు. ఈ క్రమంలో భట్టి విక్రమార్క పాదయాత్రలో పాల్గొంటానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు.
హైదరాబాద్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాదయాత్ర, రాష్ట్రంలోని పార్టీ పరిస్థితి, వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే విషయాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా త్వరలో భట్టి విక్రమార్క చేపట్టనున్న పాదయాత్ర గురించి వెంకటరెడ్డి తెలుసుకున్నారు. దీంతో పాదయాత్రలో పాల్గొనాల్సిందిగా వెంకటరెడ్డిని భట్టి విక్రమార్క ఆహ్వానించారు.
ఈ నెల 16 నుంచి తాను పాదయాత్ర చేస్తున్నానని, పాదయాత్రలో పాల్గొనాలని కోమటిరెడ్డిని ఆహ్వానించానని భట్టి విక్రమార్క చెప్పారు. కోమటిరెడ్డి యాత్రకు సంబంధించి కొన్ని సూచనలు చేశారని అన్నారు. అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండలో బహిరంగ సభ పెట్టాలని కోరానని, మంచిర్యాల, జడ్చర్ల లేదా షాద్‌నగర్‌లో బహిరంగ సభ పెట్టాలని కోరినట్లు చెప్పారు. నకిరేకల్, సూర్యాపేటలో మినీ పబ్లిక్ మీటింగ్ పెట్టాలని కోరానని, పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి శని, ఆదివారాల్లో యాత్రలో పాల్గొంటానని వెంకటరెడ్డి తెలిపారు.