న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో రాణించకపోయినప్పటికీ.. గతంలో కంటే ఎక్కువ సీట్లే సాధించింది. అధికారమే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహించినప్పటికీ.. కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. అయినప్పటికీ బీజేపీ సీట్లతోపాటు ఓటింగ్ శాతం పెరగడంపై ఆ పార్టీ నేతలు కొంత సంతృప్తిగానే ఉన్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. తెలంగాణతో తమ బంధం విడదీయరానిది.. రాష్ట్ర ప్రజల కోసం బీజేపీ పనిచేస్తూనే ఉంటుందని ప్రధాని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందని.. కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. బీజేపీ మూడోస్థానంలో నిలిచిందన్నారు. దక్షిణాది రాష్ట్రంలో బీజేపీ ప్రాబల్యం పెరుగుతోందని.. దాన్ని మరింతగా పెంచేందుకు కృషి చేస్తూ ఉంటామని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
‘నా ప్రియమైన తెలంగాణా సోదరసోదరీమణులారా, మీరు బీజేపీ ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాలుగా, మా మద్దతు పెరుగుతూనే ఉంది, ఈ సరళి రాబోయే కాలంలో కూడా కొనసాగుతుంది. తెలంగాణతో మా బంధం విడదీయరానిది, ప్రజల కోసం మేము పని చేస్తూనే ఉంటాం. ప్రతి బీజేపీ కార్యకర్త చేసిన అపార కృషిని నేను అభినందిస్తున్నాను’ అని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మరోవైపు, కేంద్రంమత్రి అమిత్ షా కూడా తెలంగాణ అసెంబ్లీ ఫలితాలపై స్పందించారు. తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు, మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అంతేగాక, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. అవినీతి, కుటుంబ రాజకీయాలను ప్రజలు సహించరని ప్రధాని మోడీ విపక్షాలపై విరుచుకుపడ్డారు. 60 ఏళ్ల పాలనలో ఆదివాసీలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఆరోపించారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన విజయోత్సవ సభకు ప్రధాని నరేంద్ర మోడీ సహా పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. మూడు రాష్ట్రాల గెలుపు గ్యారంటీతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని మోడీ ధీమా వ్యక్తం చేశారు.









