AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కొడంగల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై మర్డర్ అటెంప్ట్ కేసు నమోదైంది. ఓ యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై నారాయణపేట జిల్లా కోస్గి పోలీసుస్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది. తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటంతోనే తనపై దాడిచేసి చంపాలని చూశారని బాధితుడు కూర నరేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరికొందరు తనపై ఈనెల 24న దాడి చేశారన్నారు.

‘టౌన్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పెళ్లికి సంబంధించిన పనులు చేసి శుక్రవారం అర్ధరాత్రి దాటాక నేను బైక్‌పై ఇంటికి వెళ్తున్నా. ఆ సమయంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మాకల రాజేష్‌, బాలేశ్‌, హిలీశ్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, వెంకట నర్సింలు, కోనేరు సాయప్ప, అమీర్‌ షేక్‌, ఫసియోద్దీన్‌లు నా బైక్‌ను ఆపి కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తావా అంటూ బూతులు తిట్టారు. ఆపై కారులోకి బలవంతంగా ఎక్కించి తీసుకెళ్లారు. కర్రలు, రాళ్లతో రక్తం వచ్చేలా నన్ను కొట్టారు. నాపై దౌర్జన్యం చేసి చంపే ప్రయత్నం చేశారు.’ అని బాధితుడు కూర నరేశ్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫోన్‌, బైకు తాళంచెవి, 3 తులాల బంగారు గొలుసు, రూ.20 వేల నగదు కూడా లాక్కున్నారని అందులో తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వారిపై హత్యాయత్నంతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ANN TOP 10