ఎన్నికల ప్రచారంలో ఖర్గే, ప్రియాంక
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ మాత్రమే నెరవేర్చగలదన్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక. తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎల్‌బీ నగర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించారు. రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించబోతుందన్నారాయన. ఇక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ప్రజల త్యాగాల వల్ల ఏర్పడిందని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. అన్ని వర్గాలకు అన్యాయం చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు ప్రియాంక.
హుస్నాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలోనూ ప్రియాంక పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటయ్యాయన్నారామె. హుస్నాబాద్ సభ ముగించుకుని వెళ్తూ ఆమె కిషన్ నగర్‌లో జాగిరి రాజయ్య అనే రైతు ఇంటి దగ్గర కాసేపు ఆగారు.. రైతు కుటుంబ సభ్యులతో ముచ్చటించారు ప్రియాంక. నల్గొండ జిల్లా నకిరేకల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం నిర్వహించిన బహిరంగ సభలో టీపీసీసీ రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు రేవంత్. ఇక పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు న్యాయం జరగలేదన్నారు కోమటిరెడ్డి. ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా తెలంగాణలో ప్రచారం మరింత ఉధృతం చేయనుంది.