హుస్నాబాద్‌లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ
ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నెరవేరలేదని, పదేళ్లలో యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని, కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రం మంత్రి పదవులను ఇచ్చుకున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గెలుపు కోసం నిర్వహించిన విజయ భేరి సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. గౌరవెల్లి, గండిపెల్లి, తోటపల్లి ప్రాజెక్ట్‌ల భూనిర్వాసితులకు న్యాయం చేశారా?, బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలనలో సంతోషంగా ఉన్నారా? అని సభకు హాజరైన వారిని అడగగా లేదని సమాధానం చెప్పారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీ ఆలోచలనకు అనుగుణంగా పని చేస్తామని స్పష్టం చేశారు.
ప్రాజెక్టులు అవినీతి మయంగా మారిపోయాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య జరుగుతున్నాయని తెలిపారు. ఢిల్లీలో బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతు ఇస్తే, తెలంగాణ బీఆర్‌ఎస్‌కు బీజేపీ మద్దతు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం పేదలు, గిరిజనులు, దళితుల కోసం పనిచేయకుండా పెద్దల వ్యవస్థలకే పని చేస్తుందని ఆరోపించారు. ఎన్నికల సమయం, అందరం ఆలోచించాల్సిన సమయమన్నారు. పదేళ్ల క్రితం రాష్ట్రం ఇచ్చామని, ఇక్కడ పరిపాలన ఎలా ఉందో మీకు తెలుసని, మీ త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ గురించి అందరం ఆలోచించాలన్నారు. యువత ఆలోచనలకు తగ్గట్లుగా ప్రభుత్వాలు ఉండాలన్నారు.
ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆదానీ లాంటి పెద్ద పారిశ్రామిక వేత్తలకు దేశంలోని సంపద ఎల్‌ఐసీలు, రహదారులను మోదీ దోచిపెడుతున్నారన్నారు. దేశ వ్యాప్తంగా ఎంఐఎం 60కి పైగా స్థానాల్లో పోటీ చేస్తుంటే.. తెలంగాణలో 9 స్థానాల్లోనే ఎందుకు పోటీ చేస్తోందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎంలు కలిసి కాంగ్రెస్‌ను గెలవకుండా చేస్తున్నాయని అన్నారు. అవినితీ సొమ్ము ఎక్కడ బయటకు వస్తుందో అని ఆందోళన చెందుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలను ఈ ప్రభుత్వం చీకటిలోకి తీసుకెళ్తుందన్నారు. మీ శక్తి… మీ సంపద మీకే చెందాలనేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో గెలవగానే గ్యారంటీలను అమలు చేశాం, తెలంగాణలో సైతం గెలవగానే మొదటగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. నాన్న( రాజీవ్ గాంధీ) చనిపోయిన తర్వాత తమ కుటుంబానికి పీవీ నరసింహారావు అండగా నిలిచారని గుర్తు చేశారు.