ఎటువంటి పత్రాలు లేకుండా ఓ కారులో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న రూ.5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ వద్ద గురువారం తెల్లవారుజామున గచ్చిబౌలి పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కారు ను తనిఖీ చేయగా అందులో రూ.5 కోట్లు ఉన్నాయి. ఆ వాహనంలో ఉన్న సంతోశ్, నరేశ్, సంపత్ అనే వ్యక్తులు నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు చూపకపోవడంతో డబ్బును సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. కారు కరీంనగర్‌కు చెందిన వేల్పూరి రామారావు పేరిట ఉంది.
అందులో ఉన్న ముగ్గురు పెద్దపల్లికి చెందిన వారు. దొరికిన నగదు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు చెందిన నాయకులదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ విషయానికి సంబంధించి మీడియాకు సమగ్ర వివరాలు వెల్లడించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో రూ.1.50 కోట్లు సీజ్ చేసిన పోలీసులు ప్రభుత్వానికి రూ.1.40 కోట్లు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.5 కోట్ల నగదుకు సంబంధించి వివరాలు చెప్పకుండా గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. దొరికింది రూ.5 కోట్లేనా..? ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఓటర్లకు పంపిణీ చేస్తున్న రూ.26 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీరోలులో రూ.24 లక్షలను పట్టుకున్నారు.