–మోదీ మాటిచ్చారు..
– ఈటల సంచలన వ్యాఖ్యలు
– పార్టీలో హాట్‌హాట్ చర్చ
తెలంగాణలో బీజేపీ గెలిస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 మంది ప్రముఖుల ముందు స్వయంగా ప్రధాని మోదీయే హామీ ఇచ్చారని ఆయన అన్నారు. ఈటల మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎల్బీస్టేడియంలో జరిగిన బీజేపీ బీసీ జనగర్జన సభ తర్వాత.. పలు అంశాలపై మోదీ తనతో మాట్లాడినట్లు ఈటల చెప్పారు. బీజేపీ సీఎం అభ్యర్థినిని తానేనని.. బీసీ సామాజికవర్గానికి చెందిన 30 మంది ప్రముఖుల ముందు చెప్పినట్లు ఈటల రాజేందర్ తెలిపారు. ఇప్పుడీ ఈటల వ్యాఖ్యలు బీజేపీతో పాటు ఇతర పార్టీల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని తప్పించిన తర్వాత ..పార్టీలో ఈటల రాజేందర్‌కు ప్రాధాన్యత పెరిగింది. అసలు ఈటల రాజేందర్ వల్లే బండి సంజయ్ పదవి పోయిందనే ప్రచారం ఆ మధ్య జరిగింది. బండి సంజయ్ అందరినీ కలుపుకొని పోవడం లేదని.. ఢిల్లీకి వెళ్లి ఈటల పలుమార్లు ఫిర్యాదు చేయడం వల్లే.. రాష్ట్ర నాయకత్వాన్ని మార్చారనే వార్తలొచ్చాయి. ఇటీవల ఓ సభలో బండి సంజయ్ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కార్యకర్తలు సీఎం..సీఎం అని నినాదాలు చేశారు. మీరు ‘సీఎం.. సీఎం’ అని అరవడం వల్లే.. నా పదవి పోయిందని బహిరంగంగానే బండి చెప్పడం గమనార్హం.









