తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి ఆపై జరిగిన ర్యాలీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం బిడ్డ జలగం వెంగళరావు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాకు ఆనేక పరిశ్రమలు ఇచ్చింది. మళ్లీ అలాంటి అవకాశం ఖమ్మం జిల్లాకు రాబోతుంది. మధిర బిడ్డగా నన్ను మీరు ఆశీర్వదించి గెలిపిస్తే అలాంటి అభివృద్ధిని ఖమ్మం కు తీసుకువస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రజలను కార్యకర్తలను, ఉద్దేశించి భట్టి విక్రమార్క ప్రసంగించారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు ఉన్నందున నాగార్జునసాగర్ నీళ్లు ఖమ్మం జిల్లాకు రావడానికి సాధ్యమైందన్నారు. నేడు చదువుకున్న యువతకు ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు, విద్యాసంస్థలు, వ్యవసాయ పరిశ్రమలు తీసుకు రావాలంటే మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని, అందుకోసం కాంగ్రెస్ కార్యకర్తలు కంకణబద్ధులై పని చేయాలని పిలుపునిచ్చారు. పీజీలు, డిగ్రీలు ఉన్నత చదువులు చదివిన యువకులు కొలువులు రాకపోవడంతో రోజువారి కూలీలుగా పని చేసుకోవాల్సిన దుస్థితికి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని మండిపడ్డారు. నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రకటించిన ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తుందన్నారు.
అవినీతి రహిత పరిపాలన అందిస్తామని ఎలాంటి నిధులు కొరత లేకుండా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని వివరించారు.పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా తాను రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలను కదిలించి రాష్ట్ర సంపద దోపిడీ చేస్తున్న బీఆర్ఎస్ పాలకులపై అలుపెరుగని పోరాటం చేశానని వివరించారు. ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేసే క్రమంలో మధిర బిడ్డగా ఎక్కడ తలదించలేదు. తల ఎత్తుకునే విధంగానే పనిచేశానని వెల్లడించారు. అనేక హామీలు వాగ్దానాలు మాయమాటలు చెప్పి 10 ఏండ్లుగా మోసం చేసిన బిఆర్ఎస్ పాలన ఇక చెల్లదని, ఇక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దంచుదాం- దించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు గజ్వేల్ లో ప్రజల నుంచి సెగ తాకడంతో కామారెడ్డికి పారిపోయాడని, ప్రజల సెగ తట్టుకోలేక ఆ పెద్దాయన పారిపోతేనే అతి గతి లేదని మధిరలో ఈయన ఎంత? అంటూ బీఆర్ఎస్ అభ్యర్థి పై పరోక్ష విమర్శలు చేశారు.









