తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ నేతల ఇళ్లే టార్గెట్గా ఐటీ దాడులు జరగటం దేనికి కారణమని టీపీసీసీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై దాడులు ఎందుకు జరగటం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు రేవంత్ ట్వీట్ చేసారు.
‘నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్ల పై ఐటీ దాడులు దేనికి సంకేతం!? బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!? రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ – కేడీ బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇది. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయం.’ అని రేవంత్ ట్వీట్ చేసారు.
కాగా, మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టార్గెట్గా ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఏక కాలంలో దాడులు చేశారు. ఖమ్మంలోని ఆయన నివాసంతో పాటు పాలేరులోని క్యాంపు కార్యాలయంలో, హైదరాబాద్లోని నివాసం, రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఐటి, ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు ఎనిమిది వాహనాలలో వచ్చిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తు్న్నారు. హైదరాబాద్లో ఆయన బంధువుల ఇళ్లలోనూ ఐటీ దాడులు జరుగుతున్నాయి.









